Congress leader Tummala Nageswara Rao: ఖమ్మం ఎన్నికపై కోట్లలో బెట్టింగులు సాగుతున్నాయని, మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకులు తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదిస్తే రానున్న ఐదేండ్ల‌లో ఖమ్మం పునర్ నిర్మాణంతో జిల్లా ప్ర‌గ‌తికి కృషి చేస్తాన‌ని చెప్పారు. 

Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఖ‌మ్మం రాజ‌కీయాలు కాక‌రేపుతున్నాయి. అధికార పార్టీ భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్), కాంగ్రెస్, బీజేపీ, వామ‌ప‌క్ష పార్టీలు నువ్వానేనా అనే విధంగా మాట‌ల యుద్ధం చేస్తూ ఎన్నిక‌ల హీటును మ‌రింత‌గా పెంచాయి. ఈ క్ర‌మంలోనే ఖ‌మ్మం సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు, మాజీ మంత్రి, కాంగ్రెస్ లీడ‌ర్ తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తనకు , మాజీ ఎంపీ రేణుకా చౌదరికి రాజకీయ జీవితాన్ని అందించింది దివంగత ఎన్టీఆర్ (నంద‌మూరి తార‌క రామారావు) అని అన్నారు. ఎన్టీఆర్ ఆశీస్సులతోనే తాము ఇంత కాలం ప్రజా జీవితంలో ఉన్నామని తెలిపారు. వెంగళరావు కుటుంబంపై తొలిసారి ఎన్టీఆర్ తనను నిలదీశారని పేర్కొన్నారు.

కురవి మండలం బలపాల గ్రామస్తులు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం సమావేశానికి తుమ్మల హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన రాజకీయ జీవితంలో బలపాల గ్రామస్తులు తనకు ఎప్పుడూ అండగా నిలిచారని అన్నారు. వామపక్ష యోధులు ఉన్న జిల్లాలో తాను గౌరవప్రదమైన రాజకీయాలు చేశానని చెప్పిన తుమ్మ‌ల.. ప్రస్తుత ఖ‌మ్మం రాజ‌కీయాల‌పై ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అధికార పార్టీ బీఆర్ఎస్ తీరుపై మండిప‌డ్డారు. ప్రజా ప్రయోజనాల కోసమే తాను 4 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నానని స్ప‌ష్టం చేశారు.

ఖమ్మంలో బీఆర్‌ఎస్ అరాచకాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయనీ, ముఖ్య‌మంత్రి కే. చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్) తీరునుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ అరాచకాలను అడ్డుకోవ‌డానికి ఓటర్లు కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోరారు. రానున్న ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ కు త‌గిన గుణ‌పాఠం చెప్పాల‌ని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదిస్తే రానున్న ఐదేండ్ల‌లో ఖమ్మం పునర్ నిర్మాణంతో జిల్లా ప్ర‌గ‌తికి కృషి చేస్తాన‌ని చెప్పారు. ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉంటూ ఈ ప్రాంతం అభివృద్దికి కృషి చేస్తాన‌ని తెలిపారు.