అభివృద్ధికి మారుపేరు బీఆర్ఎస్.. 78 స్థానాల విజయంతో మళ్లీ అధికారం మాదే: తలసాని శ్రీనివాస్ యాదవ్
Talasani Srinivas Yadav: బీసీ సీఎం అంటూ బీజేపీ చేస్తున్న ప్రచారం పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందిస్తూ.. గత ఎన్నికల్లో రెండు సీట్లు కూడా గెలవని కాషాయ పార్టీ బీసీ ముఖ్యమంత్రి అంటూ ప్రచారం చేయడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. తాము ఎవరీకీ బీ టీమ్ కాదనీ, సింగిల్ గానే విజయం సాధిస్తామని అన్నారు.
Telangana Assembly Elections 2023: తెలంగాణలో మరోసారి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నాయకత్వంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధికారంలోకి వస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. 78 స్థానాలకు పైగా విజయం సాధించి జాతీయ రాజకీయాల్లోనూ తమ పార్టీ పెద్దన్న పాత్ర పోషిస్తుందని సనత్‌నగర్ బీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఉన్న తలసాని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమకు ఎవరి మద్దతు అవసరం లేదనీ, బీఆర్‌ఎస్ తన రెండు దఫాలుగా చేపట్టిన అభివృద్ధి పథకాలను వివరిస్తూ ఆయన అన్నారు. తాము ప్రజల కోసం తీసుకువచ్చి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే మరోసారి అధికారం కట్టబెడతాయని పేర్కొన్నారు. ఇదే క్రమంలో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఖండించారు.
''మేం ఏ టీమ్, ఏ పార్టీకి బీ టీం కాదు, బీజేపీ, కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాయని'' మంత్రి అన్నారు. పాతబస్తీ నుంచి మాత్రమే వెనుకబడిన కుల సంఘాల నేతలకు కాంగ్రెస్ టిక్కెట్లు ఇచ్చిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ కూడా 27 మంది ఫిరాయింపుదారులను టిక్కెట్లు ఇచ్చిందనీ, ఇది ఆ పార్టీ నుంచి ఎన్నికల బరిలో నిలపడానికి అభ్యర్థులు లేరని తెలియజేస్తోందన్నారు.
తాము అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలను దేశమే కాపీ కొడుతున్నదని పేర్కొన్నారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌పై బ్యారేజీలకు నష్టం వాటిల్లిన అంశంపై మంత్రి తలసాని యాదవ్ మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టులో నష్టం జరిగితే కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుంటామన్నారు.