బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అరెస్ట్
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మొదటిసారి తన నియోజకవర్గం అచ్చంపేటకు వెళుతున్న బాలరాజును పోలీసులు అరెస్ట్ చేసారు.
నాగర్ కర్నూల్ : ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అరెస్టయ్యారు. అచ్చంపేటకు వెళుతున్న అతడిని మార్గమధ్యలో వెల్దండ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేసిన పోలీసులు వెల్దండ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బాలరాజు మొదటిసారిగా అచ్చంపేటకు వెళుతున్నారు. నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకులతో కలిసి అచ్చంపేటల మీడియాతో మాట్లాడాల్సి వుంది. అలాగే అంబటిపట్టి గ్రామ ఆలయంలో ధ్వజస్తంభ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాల్సి వుంది. అయితే మాజీ ఎమ్మెల్యే బాలరాజును అడ్డుకోవాలని కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా మాజీ ఎమ్మెల్యేను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసారు.
మాజీ ఎమ్మెల్యే బాలరాజు అరెస్ట్ పై ఆయన అనుచరులు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే వెల్దండ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని బాలరాజును విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతో పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.
Also Read బిఆర్ఎస్ లో మొదలైన రాజీనామాలు ... కేటీఆర్ జిల్లానుండే షురూ...
ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ తనను అక్రమంగా అరెస్ట్ చేసారని బాలరాజు మండిపడ్డారు. తన అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. భార్యతో కలిసి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళుతుండగా అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను పుట్టిపెరిగిన అచ్చంపేటలో కాంగ్రెస్ నాయకుల ఆగడాలను కట్టడి చేయాలని బాలరాజు డిమాండ్ చేసారు.
ఇదిలావుంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ అచ్చంపేటలో ఉద్రిక్తతల చోటుచేసుకున్నాయి. అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే బాలరాజుపై దాడులు కూడా జరిగాయి. బిఆర్ఎస్ నేతలు డబ్బులు తరలిస్తున్నారనూ అనుమానంతో కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ క్రమంలోనే గువ్వల బాలరాజు అక్కడికి చేరుకోగా పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారి పరస్పర దాడులకు దిగారు. ఈ రాళ్లు బాలరాజుకు తాకడంతో గాయపడ్డారు. దీంతో ఆయనను హైదరాబాద్ అపోలోకు తరలించి చికిత్స అందించారు.
ఇలా బాలరాజు చుట్టూ ఎన్నికలకు ముందు రాజకీయాలు సాగాయి. బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ దాడి గురించి ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించారు. అలాగే కేటీఆర్ కూడా బాలరాజును హాస్పిటల్ కు వెళ్ళి పరామర్శిం కాంగ్రెస్ పై సీరియస్ అయ్యారు.
ఎన్నికల సమయంలో చోటుచేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలోనే పోలీసులు బాలరాజును అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఆయన నియోజకవర్గంలోకి వస్తే అడ్డుకుంటామని కాంగ్రెస్ పిలుపు నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇందుకోసమే మార్గమధ్యలోనే మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.