బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా: ఇద్దరు ఎమ్మెల్సీలకు చోటు
ఇద్దరు ఎమ్మెల్సీలకు ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు కేసీఆర్ అవకాశం కల్పించారు.
హైదరాబాద్: ఇద్దరు ఎమ్మెల్సీలకు కేసీఆర్ ఎమ్మెల్యే టిక్కెట్లు కేటాయించారు. మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయనకు స్టేషన్ ఘన్ పూర్ అసెంబ్లీ స్థానం కేటాయించారు. మరో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి హుజూరాబాద్ అసెంబ్లీ టిక్కెట్టు కేటాయించారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికలకు ముందే కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరారు. హుజూరాబాద్ అసెంబ్లీ టిక్కెట్టును కౌశిక్ రెడ్డి ఆశించారు. అయితే ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపింది. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం సాధించారు. ఆ తర్వాత కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీని కట్టబెట్టి విప్ గా నియమించారు కేసీఆర్. హుజూరాబాద్ లో వచ్చే ఎన్నికల్లో ఈటల రాజేందర్ పై కౌశిక్ రెడ్డి పోటీ చేయనున్నారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు పార్టీ ఇప్పటికే నామినేట్ పదవిని కట్టబెట్టిన విషయం తెలిసిందే.
ఇక గత టర్మ్ లో కేసీఆర్ మంత్రివర్గంలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన రాజయ్యకు ఈ దఫా టిక్కెట్టే దక్కలేదు. గత టర్మ్ లో డిప్యూటీ సీఎంగా ఉన్న రాజయ్యను కేసీఆర్ భర్తరఫ్ చేశారు. ఆయన స్థానంలో ఎంపీగా ఉన్న కడియం శ్రీహరిని డిప్యూటీ సీఎంగా నియమించారు. ఎంపీ స్థానానికి కడియం శ్రీహరి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీగా కేసీఆర్ కేబినెట్ లో కొనసాగారు. అయితే 2018 ఎన్నికల్లో స్టేషన్ ఘన్ పూర్ నుండి పోటీ చేయాలని కడియం శ్రీహరి భావించారు.కానీ ఈ స్థానం నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యకే కేసీఆర్ అవకాశం కల్పించారు. రాజయ్య విజయం సాధించారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా రాజయ్య కొనసాగుతున్నారు. అయితే రాజయ్య స్థానంలో కడియం శ్రీహరికి కేసీఆర్ అవకాశం కల్పించారు.
also read:బీఆర్ఎస్, లెఫ్ట్ మధ్య పొత్తుకు బ్రేక్:కొత్త పొడుపులు పొడిచేనా?
స్టేషన్ ఘన్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కడియం శ్రీహరి, రాజయ్య వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. రాజయ్యకే టిక్కెట్టు ఇవ్వాలని ఆయన అనుచరులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ దఫా రాజయ్యను పక్కన పెట్టి కడియం శ్రీహరికి కేసీఆర్ అవకాశం కల్పించారు.