కర్రసాయంతో అడుగులో అడుగు వేస్తున్న కేసీఆర్ ... (వీడియో)
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు కేసీఆర్ కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో వున్న ఆయన చేతికర్ర సాయంతో నడక ప్రారంభించారు.
సిద్దిపేట : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మెల్లిగా నడక ప్రారంభించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రగతి భవన్ (ప్రస్తుత ప్రజా భవన్) ఖాళీ చేసిన కేసీఆర్ ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు బాత్రూంలో కాలుజారిపడ్డ ఆయన తుంటి ఎముక విరిగడంతో నడవలేకపోయారు. ఇలా చాలారోజులుగా మంచానికి, వీల్ ఛెయిర్ కి పరిమితమైన కేసీఆర్ తిరిగి నడక ప్రారంభించారు.
శస్త్రచికిత్స తర్వాత హాస్పిటల్ నుండి డిశ్చార్జీ అయిన కేసీఆర్ కొద్దిరోజులు హైదరాబాద్ జూబ్లిహిల్స్ లోని నందినగర్ నివాసంలో వున్నారు. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడి కర్ర సాయంతో నడిచే పరిస్థితికి రావడంలో నాలుగురోజుల క్రితమే ఎర్రవల్లి ఫామ్ హౌజ్ కు చేరుకున్నారు. ఫిజియో సాయంతో కర్ర పట్టుకుని అడుగులో అడుగు వేస్తున్న కేసీఆర్ వీడియోను బిఆర్ఎస్ ఎంపీ సంతోష్ ఎక్స్(ట్విట్టర్) ద్వారా పంచుకున్నాడు.
ప్రతి అడుగులో కేసీఆర్ బలాన్ని తిరిగి పొందుతున్నాడని సంతోష్ అన్నారు. ప్రస్తుతం ఎవరి సాయం లేకున్నా కర్రసాయంతో నడుస్తున్నారని తెలిపారు. గతంలో మాదిరిగా ఆయన ఎలాంటి ఇబ్బందిలేకుండా నడిచేందుకు ఎక్కువసమయం పట్టకపోవచ్చని సంతోష్ రావు అన్నారు.
ఇక ప్రస్తుతానికి బిఆర్ఎస్ పార్టీ వ్యవహారాలకు కేసీఆర్ దూరంగా వుంటున్నారు. ఆయన తనయుడు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావు లోక్ సభ ఎన్నికల కోసం పార్టీ కేడర్ ను రేడీ చేస్తున్నారు. సరిగ్గా లోక్ సభ ఎన్నికలకు ముందు కేసీఆర్ ప్రజలముందుకు వచ్చి ప్రచారంలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. అప్పటివరకు ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే రెస్ట్ తీసుకుంటూ వ్యవసాయ పనులు చూసుకోనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే వ్యవసాయ పనులను కేసీఆర్ పర్యవేక్షించడం చేస్తున్నారు. ఇటీవలే సిద్ధిపేట జిల్లా మర్కుక్ మండలంలోని వంటిమామిడి గ్రామంలోని ఓ ఫర్టిలైజర్ షాప్ యజమానికి కేసీఆర్ ఫోన్ చేసారు. ఫామ్ హౌస్ లో పంటలకు అవసరమైన ఎరువులతో పాటు కొత్తపంటలు వేసేందుకు విత్తనాలు పంపించాలని కేసీఆర్ కోరారు. పర్టిలైజర్ షాప్ యజమానితో కేసీఆర్ మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియో బయటకు వచ్చింది.