మహబూబ్ నగర్ అభ్యర్థిని ప్రకటించిన బీఆర్ఎస్.. నాగర్‌కర్నూల్ ఆర్ఎస్పీ కోసమే పెండింగ్?
బీఆర్ఎస్ మహబూబ్ నగర్ లోక్ సభ అభ్యర్థిని ప్రకటించింది. మన్నె శ్రీనివాస్ రెడ్డికి బీఆర్ఎస్ మరోసారి అవకాశం ఇచ్చింది. ఆయన మహబూబ్ నగర్ సిట్టింగ్ ఎంపీ. ఇదిలా ఉండగా.. నాగర్ కర్నూల్ అభ్యర్థి ప్రకటనను పెండింగ్‌లో పెట్టింది.
ఈ రోజు రాష్ట్ర రాజకీయాల్లో ఓ కీలక పరిణామం జరిగింది. నిన్నా మొన్నటి వరకు బీఆర్ఎస్ పై విమర్శలు సంధించిన బీఎస్పీ ఈ రోజు అదే పార్టీతో చేతులు కలిపింది. కేసీఆర్ పై చాలా సార్లు విమర్శలు చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ రోజు ఆయన నివాసానికి వెళ్లారు. పొత్తుపై ప్రతిపాదన చేశారు. ఇందుకు కేసీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రేపు బీఎస్పీ చీఫ్ మాయావతితో మాట్లాడుతానని చెప్పారు.
తెలంగాణను కాపాడటానికే బీఎస్పీతో పొత్తుకు అంగీకరించినట్టు కేసీఆర్ చెప్పారు. కాగా, తెలంగాణలో సెక్యులర్ వాతావరణం ప్రమాదంలో పడుతున్నదని, అందుకే బీఆర్ఎస్‌తో పొత్తును కోరుకుంటున్నామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. సీట్ల పంపకాలపై ఇంకా నిర్ణయం జరగలేదని, ఆర్ఎస్‌పీ అయితే.. పెద్దపల్లి, నాగర్ కర్నూల్, లేదా వరంగల్ నుంచి కూడా పోటీ చేయవచ్చు కదా.. అని కేసీఆర్ అన్నారు. అయితే.. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి ప్రకటించారని గుర్తు చేయగా.. నాగర్ కర్నూల్ లేదా వరంగల్ నుంచి కూడా ఆయన పోటీ చేయడంలో తప్పేమీ ఉన్నదని పేర్కొన్నారు.
Also Read: March 5-Top Ten News: టాప్ టెన్ వార్తలు
దీంతో నాగర్ కర్నూల్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేయవచ్చనే ప్రచారం జరుగుతున్నది. ఈ రోజు కేసీఆర్ మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశం అయ్యారు. ఈ స్థానాల నుంచి అభ్యర్థులను ప్రకటించాల్సింది. కానీ, ఒక మహబూబ్ నగర్ అభ్యర్థిని మాత్రమే ప్రకటించారు. నాగర్ కర్నూల్ సీటు పెండింగ్‌లో పెట్టారు. దీంతో పొత్తులో సీట్ల పంపకాలపై స్పష్టత వచ్చాక.. దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది.
ఇదిలా ఉండగా.. మహబూబ్ నగర్ బీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థిగా మన్నె శ్రీనివాస్ రెడ్డిని ప్రకటించారు. ఆయన గత ఎన్నికల్లో మహబూబ్ నగర్ నుంచి గెలుపొందారు. సమీప బీజేపీ అభ్యర్థి డీకే అరుణ పై సుమారు 77 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ సారి కూడా బీఆర్ఎస్ ఆయనకే మరో అవకాశం ఇచ్చింది.