పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్: తొలి అభ్యర్ధిని ప్రకటించిన గులాబీ పార్టీ
2024 లో జరిగే పార్లమెంట్ ఎన్నికలకు భారత రాష్ట్ర సమితి సిద్దమౌతుంది. నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలను ఆ పార్టీ నాయకత్వం ప్రారంభించింది.
హైదరాబాద్: చేవేళ్ల పార్లమెంట్ స్థానం నుండి సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డిని మరోసారి బరిలోకి దింపనుంది భారత రాష్ట్రసమితి (బీఆర్ఎస్) నాయకత్వం.ఈ విషయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పార్టీ నేతలకు తేల్చి చెప్పారు.
చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని బీఆర్ఎస్ ముఖ్యనేతలు, ఆ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులతో కేటీఆర్ సోమవారంనాడు హైద్రాబాద్ లో సమావేశమయ్యారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై చర్చించారు. చేవేళ్ల పార్లమెంట్ స్థానం నుండి ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డిని మరోసారి బరిలోకి దింపుతున్నట్టుగా కేటీఆర్ ఈ సమావేశంలో ప్రకటించారు. చేవేళ్ల పార్లమెంట్ స్థానంలో విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని కేటీఆర్ పార్టీ నేతలకు దిశా నిర్ధేశం చేశారు. పార్టీ బలా బలాలపై పరీశీలన చేసుకుని ముందుకు సాగాలని కేటీఆర్ సూచించారు.
also read:ఆంధ్రప్రదేశ్ పై కాంగ్రెస్ ఫోకస్: వై.ఎస్. షర్మిలతో జగన్ కు చెక్ ?
2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుండి భారత రాష్ట్ర సమితి తొమ్మిది పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాల్లో , భారతీయ జనతా పార్టీ నాలుగు స్థానాల్లో గెలుపొందింది. 2024 లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుండి మెజారిటీ ఎంపీ స్థానాలను గెలుచుకోవాలని భారతీయ జనతా పార్టీ , కాంగ్రెస్ నేతలు వ్యూహ రచన చేస్తున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది.ఈ దఫా మాత్రం తెలంగాణలో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయింది.
రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా 2024 జనవరి 3వ తేదీ నుండి సమీక్షా సమావేశాలు నిర్వహించాలని భారత రాష్ట్ర సమితి నిర్ణయం తీసుకుంది.ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, ప్రత్యర్థి పార్టీలు, నేతల బలా బలాలపై సమీక్షలు నిర్వహించానున్నారు. పార్లమెంట్ ఎన్నికల సమయం నాటికి ఏ అంశాలపై పోరాటాలు చేయాలనే దానిపై పార్టీ క్యాడర్ కు దిశా నిర్ధేశం చేయనుంది పార్టీ నాయకత్వం.
also read:విహారయాత్రలో విషాదం, వికారాబాద్ శివారెడ్డిపేట చెరువులో కారు బోల్తా: ఒకరు గల్లంతు
ఈ ఏడాది నవంబర్ 30న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని కాంగ్రెస్ పై 1.09 లక్షలు, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులపై సుమారు 3 లక్షలకు పైగా ఓట్లు బీఆర్ఎస్ కు వచ్చాయి. అయితే పార్లమెంట్ ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఓటమి పాలైన అసెంబ్లీ నియోజకవర్గాలపై ప్రత్యేకంగా కేంద్రీకరించనుంది ఆ పార్టీ. ఈ విషయమై పార్టీ నేతలకు కేటీఆర్ దిశా నిర్ధేశం చేశారు. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటమి పాలైన అభ్యర్థులే ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంచార్జులుగా ఉంటారని కేటీఆర్ తేల్చి చెప్పారు.