చార్ మినార్ పాదచారుల ప్రాజక్టు అయిుదు నెలల్లో పూర్తి చేస్తామని కెటిఆర్ అసెంబ్లీలో చెప్పారు.ఎనిమిది నెలలవుతూ ఉన్నా పూర్తయ్యే  సూచనలు కనిపించడం లేదు 

“చాలా కాలంగా మూలుగుతూ నడుస్తున్న చార్మినార్ పాదచారుల ప్రాజక్టు ( సిపిపి)ను అయిదు నెలల్లో పూర్తి చేస్తాం.” ఇది మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె టి రామరావు మార్చి 18, 2016 గురువారం నాడు తెలంగాణా అసెంబ్లీ లో చేసిన ప్రకటన.

’చార్మినార్ పాదచారుల ప్రాజక్టు’ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి హైదరాబాద్ పాత గుర్తు చార్మినార్ ను వాహనాలు విడుదల చేసే కాలష్యం నుంచి కాపాడేందుకు ఎపుడో 2007 లో మొదలుపెట్టిన ప్రాజక్టు. ఇది ఇంకా నత్త నడక నడుస్తూనే ఉంది. నిజానికి నిధుల కోరతేమీ లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో చేపట్టిన ప్రాజక్టు. ఈ ప్రాజక్టు పూర్తయితే ఈ ప్రాజక్టు విశాలమవుతుంది. ఇక్కడికి రావడానికి ప్రజలు ఇష్టపడతారు.

 జిహెచ్ ఎంసి ఎన్నికల్లో టిఆర్ఎస్ ను విజయపథంలో నడిపించినందుకు రామారావు కు, ఈ శాఖను తండ్రి,ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు కాన్కగా ఇచ్చారు. రామారావు లాంటి యువకుడి ఆధ్వర్యంలో హైదరాబాద్ కు చాలా కాలంగా పట్టి పీడిస్తున్న శని విరుగుడవుతుందనుకుంటాం. బాగు అంటే ప్యాచ్ వర్క్ లతో ,టెంపరరీ మరమ్మతులతో కాదు, నిజంగా గ్లోబల్ సిటి (ట్రూలీ గ్లోబల్) అవుతుందునుకుంటాం. ఆయనలో కూడా ఆ నమ్మకం ఉండి ఉండాలి. అందుకే, జన సాంద్రత దుప్ప్ర భావం నుంచి చార్ మినార్ ను కాపాడేందుకు ఉద్దేశించిన చార్మినార్ పాదచారుల ప్రాజక్టు సత్వరం పూర్తవుతుందని ఎక్కడో పబ్లిక్ మీటింగ్ లో కాదు, సాక్షాత్తు అసెంబ్లీలో నే ప్రకటించారు.

అయితే, అసెంబ్లీలో ప్రకటన చేసి దాదాపు ఎనిమిదిన్నర నెలలవుతున్నా ఈ ప్రాజక్టు పూర్తయ్యే సూచనలు కనిపించడం లేదు. ఎపుడు పూర్తవుతుందో కూడా చెప్పలేం. ఈ రోజు మీడియా కథనాలు ఈ ప్రాజక్టు ఎలా సాగుతున్నదో వెల్లడి చేశాయి. ఇలా హైదరాబాద్ లో కనిపిస్తున్న అట్ట హాసం కింద వైఫల్యాలెన్ని దాక్కుని ఉన్నాయో...

అ రోజు సభలో కెటిఆర్ ఏమన్నారంటే... చార్మినార్ ప్రాంతంలో మంచి కాలిబాటలునిర్మిస్తాం. ఈ ప్రాంతాన్ని కాలుష్య రహిత మండలంగా మార్చేందుకు ఇక్కడ ప్రజలకోసం బ్యాటరీ తో పనిచేసే వాహనాలు నడిపిస్తాం. ఈ ప్రాజక్టులో 5.4 కిమీ 60 అడుగుల వెలుపలి రింగ్ రోడ్, 2.3 కి.మీ లోపలి రింగ్ రోడ్, రాతి పరపు కాలిబాటల ఉంటాయి.

అయితే, కోర్టు కేసులయితేనేం, చిన్న వ్యాపారస్థులను వేరేచోటికి తరలించే యత్నం అయితేనేం, కొన్ని కట్టడాలను సేకరించే విషయం.. తదితర సమస్యల వల్ల ఈ ప్రాజక్టు అనుకున్నంత వేగంగా జరగడంలేదనే అధికారుల వాదన. ఏమయితేనేం కెటి రామారావు అసెంబ్లీలో ప్రకటించిన గడువు తీరిపోయింది.

 చెప్పొచ్చేదేమంటే, రామారావు ఎన్నికల్లో విజేత అయివుండవచ్చు, జిహెచ్ ఎంసి లో ఉన్న పాత సంస్కృతి ఆయన్ని అపకీర్తి పాలుచేసే ప్రమాదం ఉంది. జిహెచ్ ఎంసి వాళ్ల లెక్కల ప్రకారం ప్రాజక్టులు పూర్తవుతాయని నమ్మడం కష్టం. వాటిని నమ్ముకుని ప్రకటనలు చేస్తే ఇలా ఉంటుంది. ఏకారణమయినా జాప్యమూ వైఫల్యమే. మీడియా కథనాల ప్రకారం చార్మినార్ పాదచారుల ప్రాజక్టు ఇప్పట్లో పూర్తయ్యే సూచనలు లేవు.