పెళ్లైన నెలకే భర్త అఫైర్స్ తెలిసి..ఆ నవ వధువు

First Published 11, Oct 2018, 5:04 PM IST
bride sravani commits suicide due to husband harassment
Highlights

 భర్తే సర్వస్వంగా భావించింది ఆ నవ వధువు. భర్త జీవితంలో తానే ఉండాలి తప్ప వేరొకరు ఉండకూడదని ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుంది. నెలరోజులు ఎంతో సవ్యంగా కాపురం చేసిన భర్త భాగోతం నెమ్మదిగా భయటపడింది. తన భర్త జీవితంలో తాను కాక మరో ఇద్దరు ఉన్నారని తెలిసి భరించలేకపోయింది. తన భర్తను నిలదీసింది. తనకు ఎందుకు అన్యాయం చేశావంటూ ప్రశ్నించింది. 

కరీంనగర్: భర్తే సర్వస్వంగా భావించింది ఆ నవ వధువు. భర్త జీవితంలో తానే ఉండాలి తప్ప వేరొకరు ఉండకూడదని ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుంది. నెలరోజులు ఎంతో సవ్యంగా కాపురం చేసిన భర్త భాగోతం నెమ్మదిగా భయటపడింది. తన భర్త జీవితంలో తాను కాక మరో ఇద్దరు ఉన్నారని తెలిసి భరించలేకపోయింది. తన భర్తను నిలదీసింది. తనకు ఎందుకు అన్యాయం చేశావంటూ ప్రశ్నించింది. 

తన అసలు భాగోతం భార్య  కనిపెట్టడంతో బుద్దిమార్చుకోవాల్సింది పోయి మరింత రెచ్చిపోయాడు. తాళికట్టిన భార్యను వేధింపులకు గురి చేశాడు. చిత్రహింసలకు గురి చేశాడు. అయినా భరించింది. సహించింది. భర్త చేస్తున్న ఆగడాలను అత్తమామలకు చెప్తే వాళ్లు మందలించాల్సింది పోయి కొడుకునే వెనకేసుకువచ్చారు. అదనపు కట్నం తీసుకురావాలంటూ వేధించడంతో తట్టుకోలేకపోయింది. 

అత్తమామల వేధింపులు భరించింది. భర్త చిత్రహింసలకు సహించింది. ఇక్కడే ఉంటే తన ఆగడాలకు అడ్డువస్తుందన్న నెపంతో ఆ కిరాతక భర్త ఆమెను పుట్టింటికి పంపించేశాడు. తల్లికి భారం కాకూడదనుకున్న ఆ నవ వధువు బలవన్మరణానికి పాల్పడింది. అందరి హృదయాలను కదిలించి వేస్తున్న ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. 

వివరాల్లోకి వెళ్తే సుల్తానాబాద్ కు చెందిన శ్రావణి(26)కి జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం ముంజపల్లి గ్రామానికి చెందిన తంగళ్లపల్లి రాజేశ్ కు 11 నెలల క్రితం వివాహమైంది. పెళ్లి సమయంలో ఐదు లక్షల నగదు, ఇతర కట్నకానుకలు ముట్టజెప్పారు. శ్రావణి తండ్రి 20 ఏళ్ల క్రితం చనిపోయాడు. తల్లి హరిప్రియ అన్నీ తానై శ్రావణిని కష్టపడి చదవించింది. అంతేకాదు ఘనంగా పెళ్లి కూడా చేసింది. 

నెలరోజులపాటు రాజేష్ శ్రావణిల కాపురం సవ్యంగా జరిగింది. ఆ తర్వాత రాజేష్ ఇద్దరు యువతలుతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని శ్రావణికి తెలిసింది. దీంతో భర్తను నిలదీసింది. 

శ్రావణి నిలదీయడంతో రెచ్చిపోయిన రాజేష్ ఆమెను చిత్రహింసలకు గురి చేశాడు. అటు అత్తమామలు, ఆడపడుచులు సైతం అదనపు కట్నం కోసం వేధించడం మెుదలుపెట్టారు. అన్నీ భరిస్తూనే ఉంది శ్రావణి. చివరకు ఆమెను పుట్టింటికి పంపించేశారు. తనకోసం చిన్నతనం నుంచి తల్లిపడ్డ కష్టాలు చూసిన శ్రావణి తన తల్లికి భారం కాకూడదని భావించింది. తల్లి లేని సమయంలో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.  

శ్రావణి తల్లి హరిప్రియ పోలీసులకు ఫిర్యాదు చేసింది.తన కుమార్తె ఆత్మహత్యకు శ్రావణి భర్త రాజేష్ అత్తమామలు,ఆడపడుచులే కారణమని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు శ్రావణి భర్త రాజేష్‌, అత్తమామలు, ఆడపడుచుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

మరోవైపు శ్రావణి సూసైడ్ నోట్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యకు పాల్పడ్డ శ్రావణి అమ్మా నన్ను క్షమించు...నీకు భారం కాకూడదని తనువు చాలిస్తున్నా అంటూ పేర్కొంది. అటు జిల్లా కలెక్టర్ పేరిట మరో లేఖ రాసింది. తన చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని వేడుకుంది.  

loader