పెళ్లై రెండు నెలలు కూడా కాలేదు. అప్పుడే ఓ నవ వధువు తన ప్రాణాలు వదిలేసింది. ఇంట్లో ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ దారుణ సంఘటన వనస్థలీపురంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... మలక్ పేటకు చెందిన పల్లవి(28) ఏంబీఏ పూర్తి చేసింది. గత ఏడాది డిసెంబర్ నెలలో వనస్థలీపురం లోని శ్రీనివాసరపురం కాలనీకి చెందిన  సంతోష్ తో వివాహం జరిగింది. సంతోష్.. స్థానికంగా ఓ గ్యాస్ ఏజెన్సీ నిర్వహిస్తున్నాడు. పెళ్లి సమయంలో పల్లివి తండ్రి... వారికి రూ.లక్ష కట్నంగా ఇచ్చి పెళ్లిజరిపించారు.

Also Read ఉద్యోగ నిమిత్తం ఇంటి నుంచి వెళ్లి.. లాడ్జిలో శవంగా మారి.....

అయితే... పెళ్లికి ముందు పల్లవి ఉద్యోగం చేసేది. పెళ్లి తర్వాత  ఆ ఉద్యోగం మానేసి భర్తకు గ్యాస్ ఎజెన్సీ నిర్వహణలో సహాయం చేస్తోంది. కాగా.. గురువారం సంతోష్ వ్యాపార నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లారు. శుక్రవారం ఉదయం అనారోగ్యంతో ఉన్న అత్తమామలు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వెళ్లారు.

ఇంట్లో ఎవరూ లేని సమయంలో పల్లవి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. హాస్పిటల్ నుంచి వచ్చిన అత్తమామ.. ఎన్నిసార్లు తలుపుకొట్టి నా తెరుచుకోలేదు. దీంతో.. తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. కాగా... అప్పటికే ఆమె చనిపోయి ఉంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.