ఆమె పెళ్లిపై ఎన్నో ఆశలుపెట్టుకుంది. తన జీవితంలోకి వచ్చేవాడి కోసం ఎన్నెన్నో కలలు కన్నది. కానీ ఆమె కలలన్నీ కళ్లలుగా మారిపోయాయి.  మెట్టింటిలోకి అడుగుపెట్టినంతసేపు కూడా పట్టలేదు ఆమె ఆనందమంతా ఆవిరవ్వడానికి. కనీసం కాళ్లకు రాసిన పారాణి కూడా ఆరలేదు. అప్పుడే ఆమె కాటికి చేరింది.

సాఫ్ట్ వేర్ ఉద్యోగి అని సంబరపడి పెళ్లి చేస్తే... కనీసం ఉద్యోగం కూడా లేదని తెలిసింది. ఇదేమిటని నిలదీస్తే... విడాకులు ఇస్తామని చెప్పేశారు. దీంతో.. తీవ్ర ఆవేదనకు గురైన ఆ యువతి పుట్టింట్లో ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘటన సూర్యాపేట పట్టణంలో చోటుచేసుకుంది.

Also Read క్వారంటైన్ పాటించకుండా బయటకు.. నలుగురిపై కేసు...

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆత్మకూర్(ఎస్) మండలం గట్టికల్ గ్రామానికి చెందిన సామ ఇంద్రారెడ్డి ప్రభుత్వ టీచర్‌‌‌‌. ఇద్దరు కూతుళ్లున్నారు. పెద్ద కూతురు మౌనిక(24) సీఏ పూర్తి చేసి మంచి వేతనంతో ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌‌‌‌కు చెందిన సాయికిరణ్‌‌‌‌రెడ్డికి ఇచ్చి ఈ నెల 15న సూర్యాపేటలో ఘనంగా వివాహం జరిపించారు. 

కట్నకానుకల కింద రూ. 10 లక్షల నగదు, సుమారు 35 తులాల బంగారం, 4 కేజీల వెండి అప్పజెప్పారు. వరుడు అమెరికాలో సాఫ్ట్‌‌‌‌వేర్ ఇంజినీర్‌‌‌‌గా పని చేస్తున్నాడని, ఘట్‌‌‌‌కేసర్‌‌‌‌ దగ్గర 5 ఎకరాల భూమి ఉందని పెండ్లికి ముందు నమ్మించాడు.

పెళ్లి కార్యక్రమాల తర్వాత ఇంద్రారెడ్డి దంపతులు కూతురిని చూడడానికి శనివారం హైదరాబాద్‌‌‌‌ వెళ్లారు. అక్కడి పరిస్థితిని చూసి ఆరా తీస్తే అతను ఎలాంటి ఉద్యోగం చేయడం లేదని తేలింది. భూమి విషయం కూడా అబద్ధం కావడంతో వరుడి బంధువులను నిలదీశారు. దీంతో వారు దాడికి పాల్పడడంతో పాటు ‘మౌనికను ఇక్కడే పడి ఉండమను, లేదా విడాకులు తీసుకుని వెళ్లమను’ అని గట్టిగా దబాయించారు.

దాంతో కూతురిని తీసుకుని సాయంత్రం సూర్యాపేటలోని ఇంటికి చేరుకున్నారు. తనకు జరిగిన మోసం, మెట్టినింటి వారి ప్రవర్తనపై తీవ్రంగా కలత చెందిన మౌనిక, తన పెళ్లి కార్డుపైనే సూసైడ్ నోట్ రాసి, ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.