బాత్రూంలో ఉరివేసుకొని నవ వధువు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్ఎల్ నగర్ సమీపంలో చోటుచేసుకుంది. పెళ్లి జరిగిన ఐదు నెలలకే వధువు ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం.

పూర్తి వివరాల్లోకి వెళితే...  ఒంగోలు జిల్లాకు చెందిన నర్సింహా, అంజమ్మ దంపతులు కాప్రాలో స్థిరపడ్డారు. కాగా వారి కుమార్తె శ్రావణి(20) కి ఐదు నెలల క్రితం ఆర్ఎల్ నగర్ లో నివాసం ఉంటున్న రామాంజనేయులుకి ఇచ్చి వివాహం జరిపించారు. కాగా... పెళ్లి సమయంలో రూ.5లక్షలు వరకట్నంగా ఇచ్చారు. బంగారు ఆభరణాలను కూడా భారీగా నే ముట్ట చెప్పారు.

అయితే... పెళ్లి జరిగిన కొద్ది కాలం నుంచే అదనపు కట్నం తేవాలంటూ శ్రావణిని భర్త రామాంజనేయులు, అత్తమామ వేధించడం మొదలుపెట్టారు. ఈ వేధింపులు తట్టుకోలేకపోయిన శ్రావణి... ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలియజేసింది. వారు మరో రూ.5లక్షలు ఇవ్వడానికి అంగీకరించారు. అయితే.. అయినప్పటికీ భర్త శ్రావణిని వేధించడం ఆపలేదు.

తాజాగా గురువారం దంపతులు ఇద్దరి మధ్యా మరోసారి వివాదం చోటుచేసుకుంది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన శ్రావణి బాత్రూంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా... అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. భర్త, అత్త మామలే తమ కూతురిని పొట్టన పెట్టుకున్నారంటూ శ్రావణి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.