వరుడు ఇచ్చే కట్నం సరిపోదని ఓ వధువు ముహూర్తానికి గంట ముందు పెళ్లి క్యాన్సిల్ చేసింది. పెద్దలు చెప్పినా వినలేదు. 

హైదరాబాద్ :తెలంగాణలోని మేడ్చల్ మల్కాజ్గిరి ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. సాధారణంగా కట్నం సరిపోలేదంటూ వరుడు పెళ్లి వద్దనుకుని క్యాన్సిల్ చేసుకోవడం చూస్తుంటాం. కానీ, ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. ఓ వధువు తనకు కట్నం సరిపోలేదని పెళ్లికి గంట ముందు వివాహాన్ని క్యాన్సిల్ చేసుకుంది. దీంతో పెళ్లికి వచ్చిన వారంతా ఔరా అంటూ ఆశ్చర్యపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. 

ఘట్కేసర్ లోని పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఓ కాలనీకి చెందిన యువకుడికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటకు చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. అబ్బాయి తరఫు వారు అమ్మాయికి రెండు లక్షల కట్నం ఇవ్వాలి. ఈ మేరకు పెద్దల సమక్షంలో ఇరు కుటుంబాల మధ్య అంగీకారం కుదిరింది. దీంతో గురువారం రాత్రి వివాహానికి నిశ్చయమైంది. ముహూర్తం ఏడు గంటల 21 నిమిషాలు. ఘట్కేసర్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో పెళ్లి వేదికగా నిర్ణయించారు. ఈ మేరకు పెళ్లి పత్రికలు ముద్రించి అందరికీ పంచుకున్నారు. 

ఆరోజు మధ్యాహ్నం నుంచి పెళ్లి వేదిక వద్దకి పెళ్లి కొడుకు కుటుంబసభ్యులు, బంధుమిత్రులు చేరుకున్నారు. అయితే, ముహూర్తం దగ్గర పడుతున్నా పెళ్లికూతురి తరపు వారు పత్తా లేరు. దీంతో పెళ్లి కొడుకు తరఫు వారిలో కంగారు మొదలయ్యింది. ఏం జరిగింది? అని ఆరా తీయగా.. వధువుకు అబ్బాయి తరఫు వారు ఇచ్చే కట్నం సరిపోలేదని తేలింది. అదనపు కట్నం కావాలని వధువు డిమాండ్ చేసింది. ఇంకో గంటలో పెళ్లి ఉందనగా తనకి పెళ్లి వద్దంటూ చెప్పేసింది. చేసేదేం లేక వరుడి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు వధువు కుటుంబ సభ్యులను పిలిపించి మాట్లాడారు. అయినా ఫలితం లేకపోవడంతో వరుడి కుటుంబ సభ్యులు.. ముందు ఇచ్చిన రెండు లక్షలు కూడా వదిలేసుకుని ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.

వధువుకు జుట్టు తక్కువగా ఉందని పెళ్లి క్యాన్సిల్.. వరుడితో సహా తొమ్మిదిమందిపై కేసు...

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే ఈ జనవరిలో ఉత్తరప్రదేశ్ లో వెలుగు చూసింది. కాబోయే జీవితభాగస్వామి గురించి అనేక కలలు కంటారు అమ్మాయిలు. వరుడు రాజకుమారుడిలా ఉండాలని.. తనను మహారాణిలా చూసుకోవాలని.. అందంగా ఉండాలని, బాగా సంపాదించాలని, తెలివైనవాడై ఉండాలని.. బలశాలై ఉండాలని.. తననూ తనతో సమానంగా గౌరవించాలని.. ఇలా అనేకరకాల ఇష్టాలు, కోరికలు ఉంటాయి. అయితే, అనుకున్నవన్నీ ఉన్న వ్యక్తి దొరకడం అసాధ్యం. అందుకే కాస్త అటూ, ఇటూగా అయినా సరే.. కొన్నింటికి కాంప్రమైజ్ అయ్యి పెళ్లి చేసుకుంటుంటారు. 

అయితే, తాము అనుకున్నవి సరిగా లేవని కొన్నిసార్లు పెళ్లి పీటల మీద పెళ్లి క్యాన్సిల్ చేసుకునే అమ్మాయిల ఘటనలు ఇటీవల కనిపిస్తున్నాయి. అలాంటి ఓ విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది. వరుడికి పదిరూపాయల నోట్లు లెక్కించడం రాదని ఉన్నఫలానా పెళ్లి క్యాన్సిల్ చేసుకుందో అమ్మాయి.ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌కు చెందిన రీటా సింగ్ అనే వధువు, వరుడు 10 రూపాయల కరెన్సీ నోట్లను లెక్కించడంలో విఫలమైనందున తన పెళ్లిని రద్దు చేసుకుంది. పెళ్లి వేడుకను నిర్వహిస్తున్న పూజారి వరుడి ప్రవర్తన గురించి అమ్మాయి కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో ఈ సంఘటన జరిగింది.

పూజారి చెప్పిన విషయం విని కుటుంబం ఆశ్చర్యపోయింది. కానీ పెళ్లి పీటల వరకు వచ్చిన పెళ్లిని ఎలా క్యాన్సిల్ చేయడం? అలాగే పూజారి చెప్పింది నిజం అని నిరూపించడం ఎలా? అందుకే పెళ్లి కొడుకు వింత ప్రవర్తన గురించి విన్న వెంటనే, కుటుంబ సభ్యులు ఆ వ్యక్తిని పరీక్షించాలని నిర్ణయించుకున్నారు. అతనికి 10 రూపాయల 30 నోట్లను ఇచ్చి వాటిని లెక్కించమని కోరారు. అయితే ఆ చిన్న లెక్క చేయడానికి వరుడు కిందామీదా పడ్డాడు. చాలా ప్రయాసపడ్డాడు. అది వధువు ముందు తనను తాను నిరూపించుకునే చివరి అవకాశం.. కానీ ప్రయోజనం లేకపోయింది. దీంతో 21 ఏళ్ల యువకుడు పెళ్లి వేడుక నుండి బయటకు వెళ్లి, పెళ్లిని రద్దు చేయాలని నిర్ణయించుకున్నాడు.