ఎల్బీనగర్ ప్రేమోన్మాది ఘటన : ఝాన్సీ చూపించిన సాహసం.. సంఘవిని కాపాడింది...
ఎల్బీనగర్ లో ప్రేమోన్మాది దాడి ఘటనలో ఓ మహిళ చూపించిన తెగువతో సంఘవి ప్రాణాలతో బయటపడింది. నిందితుడు పట్టుబడ్డాడు.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఎల్బీనగర్ లో బాలికపై ప్రేమోన్మాది ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో బాధితురాలు పొరుగింట్లో ఉండే గృహిణి సాహసంతో యువతి ప్రాణాలు కాపాడింది. ఇప్పుడు ఆమె చూపించిన తెగువ అందరి ప్రశంసలు అందుకుంటుంది. ప్రేమోన్మాది బారిన పడిన సంఘవిని రక్షించడానికి ఆమె అత్యంత సాహసాన్ని ప్రదర్శించింది.
ఆమె చేసిన పని వల్లే ప్రేమోన్మాది పోలీసులకు చిక్కాడు. ఆమె పేరు ఝాన్సీ. పేరుకు తగ్గట్టే సాహసాన్ని ప్రదర్శించింది. దీనికి సంబంధించిన వివరాలలోకి వెడితే…ఎల్బీనగర్ ఆర్టీసీ కాలనీలోని సంఘవి అనే యువతి ఇంట్లోకి ఆదివారం మధ్యాహ్నం శివకుమార్ అనే ప్రేమోన్మాది హఠాత్తుగా కత్తితో ప్రవేశించాడు. పెళ్లికి ఒప్పుకోవడం లేదంటూ విచక్షణా రహితంగా దాడి చేయబోయాడు.
ఎల్‌బీ నగర్ ప్రేమోన్మాది దాడి కేసు .. ఉస్మానియాకు సంఘవి, పోస్ట్‌మార్టానికి చింటూ మృతదేహం
సంఘవిపై దాడికి ప్రయత్నించాడు. ఆమె సోదరుడు పృథ్వి ఇది గమనించి అక్కపై జరిగే దాడిని అడ్డుకోబోయాడు. దీంతో శివకుమార్ పృథ్విని కత్తితో పొడవడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. యువతి మీద కూడా విచక్షణారహితంగా దాడి చేశాడు. తమ్ముడిపై కత్తి దాడితో తీవ్ర భయాందోళనలకు గురైన యువతి గదిలోకి వెళ్లి తలుపు వేసుకుని గట్టిగా కేకలు వేయడం ప్రారంభించింది.
ఆ కేకలు పక్కింట్లో ఉన్న గృహిణి ఝాన్సీ అని మహిళ విన్నది. వెంటనే బయటికి వచ్చి చూడగా అప్పటికే పృథ్వి ఇంట్లో నుంచి తీవ్ర రక్తస్రావంతో బయటికి వస్తూ కనిపించాడు. కంగారుపడ్డ ఝాన్సీ ఏమైందని ప్రశ్నించింది. ఆమెకి అక్క ఇంట్లో ఉంది అంటూ సమాధానం చెబుతూనే పృథ్వి కింద పడిపోయాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే… అందుబాటులో ఉన్న ఓ కర్ర పట్టుకుని ఇంటివైపు వెళ్ళింది ఝాన్సీ.
కిటికీలోనుంచి ఇంట్లోకి తొంగి చూడగా.. సంఘవి ఓ గదిలో దాక్కుని తీవ్ర గాయాలతో భయంతో వణికి పోతోంది. మరోవైపు నిండితుడు శివకుమార్ కత్తితో సంఘవి కోసం వెతుకుతున్నాడు. వెంటనే ఝాన్సీ అప్రమత్తమయింది. గట్టిగా కేకలు వేస్తూ.. కర్రతో తలుపులను బాధతో నిండితుడిని హెచ్చరించింది. స్థానికంగా ఉన్న యువకులను కేకలు వేసి పిలిచింది.
ఝాన్సీ పిలుపుమేరకు వెంటనే అక్కడికి చేరుకున్న యువత సంఘవి ఇంట్లోకి వెళ్లడం కోసం తలుపులు, కిటికీలు తొలగించేందుకు ప్రయత్నించారు. ఒక్కసారిగా అంతమంది గుమిగూడడంతో శివకుమార్ భయపడ్డాడు. ఇంటిలోపలే ఉండిపోయాడు. ఝాన్సీ అక్కడితో ఆగిపోలేదు.. వెంటనే తన భర్తకు ఫోన్ చేసింది. పోలీసులకు సమాచారం అందించింది.
వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులను చూసిన నిందితుడు లొంగిపోయాడు. సంఘవి ప్రాణాలతో బయటపడింది. ఆ తరువాత బాధితులిద్దరినీ ఆస్పత్రికి తరలించగా పృథ్వి మృతి చెందాడు. సంఘవి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.