నీకు నీ కొడుకు క్షేమంగా ఉండాలంటే.. నాకు నా భార్య కావాలంటూ.. ఓ బావ తన సొంత బావమరిదిని బెదిరించాడు. ఈ వింత సంఘటన నగర శివార్లలోని మొయినాబాద్ లో చోటుచేసుకుంది.

పూర్తివివరాల్లోకి వెళితే.. వికారాబాద్‌ జిల్లా యాలాల మండలానికి చెందిన బస్వరాజ్‌ అనిత దంపతులు మొయినాబాద్‌ మండలం గండిపేట సమీపంలోని ‘హైదరాబాద్‌ పోలో అండ్‌ హార్స్‌ రైడింగ్‌ క్లబ్‌’లో దినసరి కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. 

వీరికి ఇరవై నెలల కుమారుడు హర్ష ఉన్నాడు. పది రోజుల క్రితం బస్వరాజ్‌ చెల్లెలి భర్త కృష్ణ వీరి వద్దకు వచ్చారు. ఇక్కడే ఉండి కూలీ చేసుకుంటానని చెప్పారు. అప్పటికే తరచు గొడవ పడుతుండటంతో బస్వరాజ్‌ చెల్లెలు తన భర్తకు దూరంగా ఉంటోంది. 

దీన్ని మనసులో పెట్టుకొని అతను బావమరిది చెంత చేరి అతని కుమారుడిని అపహరించాలనుకున్నారు. ఆదివారం ఉదయం అందరూ పనిలో నిమగ్నమై ఉండగా.. బాలుడిని ఎత్తుకెళ్లారు. తాను తాండూరులో ఉన్నట్లు.. మీ కుమారుడు మీకు దక్కాలంటే భార్యను తనతో కాపురానికి పంపించాలని డిమాండ్‌ చేశారు.

 దీంతో ఆందోళనకు గురైన బస్వరాజ్‌ దంపతులు హుటాహుటిన తాండూరుకు వెళ్లగా.. అక్కడ కృష్ణ ఆచూకీ దొరకలేదు. దీంతో వారు మొయినాబాద్‌కు చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్నాప్‌ కేసు నమోదు చేసుకొన్న పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపడుతున్నారు.