ఇంజినీరింగ్ కాలేజీ అమ్మాయిల హాస్టల్ లోకి దూరి ఓ యువకుడు బీభత్సం సృష్టించాడు. అర్థరాత్రి హాస్టల్ లోకి ప్రవేశించి... ఓ యువతిపై అత్యాచారానికి ప్రయత్నించాడు. ఇతర యువతులు గట్టిగా కేకలు వేయడంతో.. అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చోటుచేసుకుంది. 

పూర్తి వివరాల్లోకి వెళితే... గురువారం తెల్లవారుజామున సుమారు 3గంటల సమయంలో ఓ యువతి వాష్ రూమ్ కి వెళ్లింది. అదే సమయంలో హాస్టల్ వెనుకవైపు ఉన్న గోడను దూకి ఓ యువకుడు లోపలికి వచ్చాడు. బాత్రూంలోకి యువతి వెళ్లడాన్ని చూసి బయట నుంచి గడిపెట్టాడు. కొద్దిసేపటి తర్వాత బాత్రూం డోర్ తెరుద్దామని యువతి ఎంత ప్రయత్నించినా.. రాలేదు. దీంతో... యువతి గట్టిగా డోర్ బాదింది.

దీంతో... ఆ యువకుడు బాత్ రూం గోడపైకి ఎక్కాడు. అరిస్తేచంపేస్తానంటూ ఆమెను కత్తితో బెదిరించాడు. తర్వాత బాత్రూం లోపలకు వంగి డోర్ గడియ తీసి ఆమెను బయటకు లాక్కొచ్చాడు. ఈ యువతి అరుపులకు నిద్రలేచిన ఇతర యువతులు గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టారు. దీంతో...వాళ్ల గదులకు గడియ పెట్టాడు..

అనంతరం యువతిపై అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆమెను రక్షించేందుకు ఇతర అమ్మాయిలు గట్టిగా కేకలు వేయడంతో... భయపడిపోయిన యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. వెళ్తూ వెళ్తూ యువతి ఫోన్ ని లాక్కొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాగా ఆ ఫోన్... హాస్టల్ గోడ దక్కర ముక్కలై లభించింది. బాధితురాలు, హాస్టల్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.