Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ లో దారుణం... బిర్యానీ తిని మృతి చెందిన బాలుడు...

హైదరాబాద్ లో దారుణ ఘటన వెలుగుచూసింది. సరదాగా హోటల్ నుంచి బిర్యానీ తెచ్చుకున్న కుటుంబం మొత్తం అస్వస్థత పాలయ్యింది. ఓ బాలుడు మృతి చెందాడు. 

Boy dies after eating biryani in hyderabad
Author
Hyderabad, First Published Aug 20, 2022, 9:01 AM IST

ఖైరతాబాద్ : హైదరాబాదులో విషాద ఘటన చోటు చేసుకుంది. రాత్రి బిర్యానీ తిని పడుకున్న కుటుంబం తెల్లారినా లేవలేదు. చుట్టుపక్కలవాళ్లు అనుమానంతో.. తలుపులు తెరిచి చూస్తే షాక్ అయ్యారు. హోటల్ నుంచి తెచ్చుకున్న బిర్యానీ తిని కుటుంబం మొత్తం అనారోగ్యానికి గురి కాగా, ఓ బాలుడు మృతి చెందాడు. సైఫాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఖైరతాబాద్ మారుతీ నగర్ కి చెందిన రాంబాబు ప్రైవేట్ ఉద్యోగి. ఈనెల 13న రాత్రి లక్డీకాపూల్ లోని ఓ రెస్టారెంట్ నుంచి కుటుంబం రెండు చికెన్ బిర్యానీలు తెచ్చుకుంది. వాటిని తిని పడుకున్నారు. కాగా మరుసటిరోజు మధ్యాహ్నం వరకు ఇంట్లో నుంచి ఎవరు బయటకు రాలేదు. 

పక్కింటి వారు అనుమానంతో తలుపులు తీసి చూడగా ఇంట్లో రాంబాబుతో పాటు భార్య త్రివేణి,  కొడుకు గౌతమ్ నంద (10), కూతురు నిహారిక అపస్మారక స్థితిలో కనిపించారు. స్థానికులు నీళ్ళు చల్లగా త్రివేణి మత్తుగా లేచింది. మిగతా ముగ్గురు లేవలేదు. 108 అంబులెన్స్ కు సమాచారం ఇవ్వగా వారు వచ్చి.. అందరికీ స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించగా అప్పటికే గౌతం నంద మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రాంబాబును, నిహారిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. త్రివేణి ఫిర్యాదు మేరకు సైఫాబాద్ ఎస్ఐ నవీన్ విచారిస్తున్నారు. బిర్యాని శాంపిల్స్ ను పరీక్షలకు పంపారు. 

రాష్ట్రంలో వందశాతం ఇళ్లకు తాగునీరు.. ఓడీఎఫ్ ప్లస్ లో తెలంగాణ టాప్.. కేంద్ర జలశక్తిశాఖ వెల్లడి...

ఇదిలా ఉండగా, తన బిర్యానీ ప్యాకెట్ కనిపించడం లేదంటూ ఒక విద్యార్థి అడిగినందుకు... మరో విద్యార్థి హాస్టల్ టెర్రస్ పై నుంచి కిందికి దూకేశాడు. దీంతో అతని కాలు విరిగింది. ఈ సంఘటన  జూలై 25న నాగర్ కర్నూలు జిల్లా.. అచ్చంపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల వసతి గృహంలో జరిగింది. అమ్రాబాద్ మండలం ఎల్లంపల్లికి చెందిన రామస్వామి, సువర్ణ దంపతుల కుమారుడు రాజేష్. స్థానిక పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. అక్కడే బాలుర వసతి గృహంలో ఉంటున్నాడు. ఆదివారం కావడంతో విద్యార్థులను చూసేందుకు తల్లిదండ్రులు వచ్చారు. 

ఈ క్రమంలో అదే తరగతికి చెందిన అరుణ్ అనే విద్యార్థి తల్లిదండ్రులు కూడా వచ్చారు. వారు కొడుకు కోసం బిర్యానీ ప్యాకెట్ తీసుకుని వచ్చారు. ఆ బిర్యానీ ప్యాకెట్ ను అరుణ్ మధ్యాహ్నం తిని.. మిగిలింది రాత్రికి తినేందుకు బాక్స్ లో పెట్టుకున్నాడు. అయితే, కొద్దిసేపటి తరువాత వచ్చి చూస్తే బాక్స్ లో పెట్టుకున్న బిర్యానీ ప్యాకెట్ కనిపించలేదు.  దీంతో తోటి స్నేహితులను ఆరా తీశాడు. ఈ క్రమంలోనే రాజేష్ ను కూడా ప్రశ్నించాడు. 

అయితే, అరుణ్ అడిగిన దానికి రాజేష్ ఏమీ మాట్లాడకుండా..  హాస్టల్ టెర్రస్ పైకి ఎక్కి.. పైనుంచి దూకేశాడు. ఇది తెలిసి అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది  వెంటనే రాజేష్ ను అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ రాజేష్ కు చికిత్స అందించిన డాక్టర్లు.. అతని ఎడమ కాలు విరిగింది అని అనుమానం వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి  రిఫర్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios