హైదరాబాద్: ప్రవీణ్ రావు, ఆయన సోదరుల కిడ్నాప్ కేసులో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గ్యాంగ్ సినిమా తరహాలో భూమా అఖిలప్రియ పథక రచన చేశారనే విషయం తెలిసిందే. ఐటి అధికారుల్లా నటించడానికి ముఠాకు భార్గవ్ రామ్ సోదురుడు చంద్రహాస్ శిక్షణ ఇచ్చినట్లు తెలుస్తోంది. 
శిక్షణ సమయంలో అక్షయ్ కుమార్ నటించిన స్పెషల్ 26 అనే సినిమాను కూడా ముఠా సభ్యులకు చూపించనట్లు తెలుస్తోంది. 
అఖిలప్రియ ఆదేశాలతోనే ఆ సినిమా చూపించి కిడ్నాప్ చేయించినట్లు తెలుస్తోంది. ఐటి అధికారుల చెకింగ్ డ్రెస్సులు, ఐడి కార్లను చంద్రహాస్ తయారు చేశాడు. శ్రీనగర్ కాలనీలోని ఓ సినిమా కంపెనీ నుంచి ఆ డ్రెస్సులను అద్దెకు తీసుకున్నారు.

బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో పోలీసులు ఇప్పటి వరకు 8 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. గోవాలో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు, విజయవాడల్లో మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. వారిని హైదరాబాదు తీసుకుని వస్తున్నట్లు సమాచారం. 

బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో బాధితులను వదిలేసి నిందితులు కార్లలో వేర్వేరు ప్రాంతాలకు పారిపోయినట్లు భావిస్తున్నారు. మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ వ్యక్తిగత సహాయకుడు చెప్పిన వివరాల ఆధారంగా వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. 

అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్, మాదాల శ్రీనివాస చౌదరి అలియాస్ గుంటూరు శ్రీనుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల అదుపులో ఉన్న 8 మంది కూడా ఐటి అధికారులుగా నటించినవారేనని సమాచారం. కిడ్నాప్ నకు15 రోజుల ముందు గుంటూరు శ్రీను వారిని హైదరాబాదు రప్పించినట్లు తెలుస్తోంది. 

ఐటి అధికారుల మాదిరిగా నటించాల్సిన తీరుపై నిందితులకు భార్గవ్ రామ్ సోదరుడు హైదరాబాదులోని యూసుఫ్ గుడాలో గల ఎంజీఎం స్కూల్లో శిక్షణ ఇచ్చాడు. ఈ సమయంలో నిందితులకు గ్యాంగ్ సినిమా కూడా చూపించినట్లు తెలుస్తోంది. గ్యాంగ్ సినిమాలో ఐటి అధికారులుగా నటిస్తూ మోసాలకు పాల్పడిన వైనాన్ని ప్రధానంగా చేసుకున్నారు. నకిలీ ఐటి అధికారుల ముఠాకు ఇద్దరు గుంటూరు యువకులు నాయకులుగా వ్యవహరించారు. 

ప్రవీణ్ రావును, ఆయన సోదరుల కిడ్నాప్ నకు ఫథకం రచించిన అఖిలప్రియ ఐటీ దాడుల విషయాన్ని గుంటూరు శ్రీనుకు వివరించినట్లు తెలు్సతోంది. దీంతో ఐటి అధికారుల మాదిరిగా ఉండే తన మిత్రులను గుంటూరు శ్రీను ఎంపిక చేశాడు.  డ్రైవర్లుగా గుంటూరు శ్రీను గుంటూరు, కర్నూలు, కడప జిల్లాలకు చెందిన ముగ్గురిని ఎంపిక చేశాడు. 

ప్రవీణ్ రావును కిడ్నాప్ చేసి, ఆయన సమాచారాన్ని సేకరించి భార్గవ్ రామ్ కు చెప్పడం వండటి పనులు చేసిన డ్రైవర్ బాల చెన్నయ్య పాత నేరస్థుడే.  గుంటూరు శ్రీను ఏపీ సుబ్బారెడ్డిపై హత్యాయత్నం కేసులో అరెస్టయి కడప జిల్లా జైలులో ఉన్నప్పుడు అతనితో పరిచయం ఏర్పడింది. 

డ్రైవర్ ఉద్యోగం ఇప్పించాలని బాలచెన్నయ్య గుంటూరు శ్రీనును కోరాడు. కిడ్నాప్ వ్యవహారంలో పనికి వస్తాడని అతన్ని గుంటూరు శ్రీను ఈ నెల 2వ తేదీన హైదరాబాద్ రప్పించాడు.  ఓ పని పూర్తి చేసిన తర్వాత డ్రైవర్ ఉద్యోగం ఇప్పిస్తానని గుంటూరు అతనికి చెప్పాడు. తర్వాత సంపత్ కుమార్ వద్దకు తీసుకుని వెళ్లాడు. సంపత్, చెన్నయ్య కలిసి ప్రవీణ్ రావు ఇంటి పరిసరాల్లో రెక్కీ నిర్వహించారు.

తెలంగాణ పోలీసులు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోనూ విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న భార్గవ్ రామ్ ఓ టీడీపీ నేతకు ఫోన్ చేసినట్లు పోలీసులు కనిపెట్టారు. దాంతో టీడీపీ నేతను మంగళవారం సోమవారం పొద్దుపోయే వరకు విచారించారు. మంగళవారంనాడు ఆళ్లగడ్డకు చెందిన ఓ మండల స్థాయి ప్రజాప్రతినిధిని, చాగలమర్రికి చెందిన టీడీపీ మద్దతుదారుడైన ఓ న్యాయవాదిని పోలీసులు విచారించారు.