తెలంగాణ సిఎం కేసిఆర్ కు ఒక వ్యక్తి రక్తం తో ఉత్తరం రాసి సంచలనం సృష్టించాడు. బాధితుల గోడు వినిపించేందుకే ఆ యువకుడు ఈ పని చేశాడు. ఉద్యమ కాలం నాటి పరిస్థితులను గుర్తు తెచ్చే ఈ సంఘటన తెలంగాణలో కలవరపాటుకు గురిచేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవి.

కరీంనగర్ జిల్లాకు  చెందిన సామాజిక కార్యకర్త షేక్ సాబిర్ అలీ తన రక్తంతో సిఎం కేసిఆర్ కు ఉత్తరం రాశారు. ఆ లేఖలో ఔషధ బాధితులకు న్యాయం చేయాలని కోరారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని నాగంపేటకు చెందిన వంగర నాగరాజు ఇటీవల ఔషధ ప్రయోగం వికటించడంతో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇదే తరహా ప్రయోగం కారణంగా కొత్తపల్లికి చెందిన చిలివేరి అశోక్ కుమార్ అనే యువకుడు మతిస్థిమితం కోల్పోయాడు.

ఔషధ కంపెనీలు పేదరికాన్ని అడ్టు పెట్టుకుని వారి నిండు జీవితాలతో చెలగాటమాడుతున్నయని సామాజిక కార్యకర్త సాబిర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఔషధ ప్రయోగాలు వికటించి బాధితులైన కుటుంబాలకు ఇప్పటి వరకు ఎలాంటి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో సిఎం కేసిఆర్ చొరవ చూపాలన్న ఉద్దేశంతోనే తాను తన రక్తంతో ఉత్తరం రాసినట్లు వెల్లడించారు సాబిర్.

తెలంగాణ పేద ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న ఔషధ కంపెనీలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణలోని అనేక గ్రామాల్లో గుట్టు చప్పుడు కాకుండా అక్రమ వ్యాపారం సాగిస్తున్న ఔషధ కంపెనీలను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.