Asianet News TeluguAsianet News Telugu

ఇంటి దొంగల వల్లే బ్లాక్ మార్కెట్

2000 నోట్లనే అక్రమంగా తరలిస్తున్న క్రమంలో ఇక 500 నోట్లను కూడా అందిస్తే బ్లాక్ మార్కెట్ అరికట్టటం సాధ్యం కాదన్న ఉద్దేశ్యంతోనే రాష్ట్రానికి 500 రూపాయల నోట్లను సరిపడా ఇవ్వటంలేదని సమాచారం.

black market

కరెన్సీ సంక్షోభాన్ని కొందరు బ్యాంకు అధికారులు బాగనే సొమ్ము చేసుకుంటున్నారు. అవకాశం ఉన్నంతలో  కొత్త నోట్ల బ్లక్ మార్కెట్ చేసుకుంటూ కోట్ల రూపాయల కమీషన్ సంపాదించుకుంటున్నారు. ఈ విషయం రిజర్వ్ బ్యాంకు దృష్టకి కూడా వెళ్లింది. దీనికి ప్రధాన కారణం కేంద్రప్రభుత్వ అనాలోచిత నిర్ణయం, రిజర్వ్ బ్యాంకు చేతగానితనాన్ని క్షేత్రస్ధాయిలోని బ్యాంకు అధికారులు బాగానే ‘బ్లాక్ మార్కెట్’ చేసుకుంటున్నారు.

 

అయినకాడికి కమీషన్ల రూపంలో దండిగా సంపాదించుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్న నేపధ్యంలో ఆర్బిఐ ఫిర్యాదులపై కన్నేసినట్లు సమాచారం. ప్రజలకు చిన్న నోట్లు లేదని చెబుతూ 2000 రూపాయల నోట్లను అంటగడుతున్న బ్యాంకు అధికారులు బడా బాబులకు, అయినవారికి మాత్రం కోట్ల విలువైన 100 రూపాయల నోట్లను దొడ్డిదారిన అందిస్తున్న విషయాన్ని ఆర్బీఐ గమనించినట్లు సమాచారం.

 

 ఇటువంటి కమీషన్ వ్యాపారం ఎక్కువగా హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, కర్నూలు ప్రాంతాల్లో ఎక్కువగా నడుస్తున్నట్లు రిజర్వ్ బ్యాంకు గుర్తించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్లోని ఓ ప్రభుత్వ రంగ బ్యాంకుకు చెందిన 24 మంది సీనియర్ అధికారులతో పాటు ఇతర ప్రాంతాల్లోని 13 మంది అధికారులను గుర్తించి వారిని విధులనుండి తప్పించినట్లు తెలుస్తోంది.

  దీనికితోడు హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కర్నూలు, అనంతపురం ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కమీషన్ల కోసం పాత నోట్లను తీసుకుని కొత్త నోట్లను ఇస్తున్నట్లు ఏకంగా సెంట్రల్ ఇంటెలిజెన్స్ విభాగం ఉన్నతాధికారులే కేంద్ర ఆర్ధికశాఖకు నివేదిక ఇచ్చినట్లు సమాచారం. వివిధ బ్యాంకు అధికారులు ముఠాగా ఏర్పడటం వల్లే కమీషన్ల దందా జోరుగా సాగుతున్నట్లు కూడా నివేదికలో పేర్కొన్నట్లు ప్రచారంలో ఉంది.

 

  వివిధ మార్గాల్లో అందుతున్న నివేదికల ఆధారంగానే ఆర్బిఐ పలువురు అధికారులను విధుల నుండి పక్కన బెట్టింది. దానికితోడు అనంతపురం సరిహద్దుల్లో పెద్ద ఎత్తున పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వచ్చే వాహనాలను తనిఖీలు చేస్తున్నారంటేనే పరిస్ధితి ఏ స్ధాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. మరోవైపు సహకార బ్యాంకుల నుండి పెద్ద ఎత్తున అక్రమంగా నగదు మార్పిడి జరుగుతున్నట్లు అందుతున్న ఫిర్యాదుల కారణంగానే సహకార బ్యాంకులకు నగదు మార్పిడి అవకాశాన్ని రద్దు చేసింది.

  విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ నుండి ఇప్పటి వరకూ సుమారు 2 వేల కోట్ల మేర కొత్త నోట్లు వివిధ బ్యాంకుల నుండే అక్రమంగా బయటకు వచ్చేసినట్లు కూడా కేంద్ర ఆర్ధిక శాఖ గుర్తించినట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. 2000 నోట్లనే అక్రమంగా తరలిస్తున్న క్రమంలో ఇక 500 నోట్లను కూడా అందిస్తే బ్లాక్ మార్కెట్ అరికట్టటం సాధ్యం కాదన్న ఉద్దేశ్యంతోనే రాష్ట్రానికి 500 రూపాయల నోట్లను సరిపడా ఇవ్వటంలేదని సమాచారం.

 

బ్యాంకుల్లో  ఉంటూనే అక్రమాలకు పాల్పడుతున్నముగ్గరు సిబ్బందిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసి కేసులు నమోదు చేసారు. ప్రస్తుత సంక్షోభం ముగియగానే ఇప్పటికే గుర్తించిన ఉన్నతాధికారులపై చట్టపరమైన చర్యలకు ఆర్బిఐ రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

Follow Us:
Download App:
  • android
  • ios