నల్గొండ: నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానంలో  బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ స్థానం నుండి గిరిజన అభ్యర్ధిని బీజేపీ బరిలోకి దింపింది. అయినా కూడ ఆ పార్టీ నామమాత్రంగానే ఓట్లు దక్కించుకొంది. నోముల నర్సింహ్మయ్య అనారోగ్యంతో మరణించడంతో  ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. టీఆర్ఎస్ అభ్యర్ధిగా నోముల నర్సింహ్మయ్య తనయుడు  భగత్ బరిలోకి దిగారు.  బీజేపీ తన అభ్యర్ధిగా డాక్టర్ రవికుమార్ నాయక్ ను బరిలోకి దింపింది. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టికెట్ దక్కని ఓ టీఆర్ఎస్ నేత తమ పార్టీలోకి వస్తారని బీజేపీ భావించింది. ఆ పార్టీతో ఆ టీఆర్ఎస్ నేత కూడ టచ్ లో ఉన్నారని అప్పట్లో ప్రచారం సాగింది. అయితే టికెట్ దక్కని నేతలను టీఆర్ఎస్ నాయకత్వం సంతృప్తి పర్చింది.  దీంతో చివరి నిమిషంలో డాక్టర్ రవినాయక్ ను బీజేపీ బరిలోకి దింపింది. నాగార్జునసాగర్ లో 18 రౌండ్ల వరకు బీజేపీకి 5,683 ఓట్లు మాత్రమే వచ్చాయి. 

also read:సొంత మండలంలోనూ జానారెడ్డికి చుక్కెదురు: కాంగ్రెస్ ఆశలు ఆవిరి

2018 ఎన్నికల్లో ఈ స్థానం నుండి కంకణాల నివేదిత రెడ్డి  బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో బీజేపీకి 2675 ఓట్లు దక్కాయి. ఈ దఫా కూడ టికెట్ కోసం నివేదిత తీవ్రంగా ప్రయత్నించారు. కానీ  ఆమెకు టికెట్ దక్కలేదు. పార్టీ అభ్యర్దిని ప్రకటించకముందే ఆమె నామినేషన్ దాఖలు చేశారు. కానీ చివరకు డాక్టర్ రవికుమార్ టికెట్ దక్కడంతో ఆమె నామినేషన్ ను ఉపసంహరించుకొన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో మాత్రం బీజేపీ విజయం సాధించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కమలం పార్టీ అనూహ్య ఫలితాలను దక్కించుకొంది. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీ ఆశించినస్థాయిలో ఓట్లను రాబట్టలేకపోయింది. అయితే గత ఎన్నికలతో పోలిస్తే ఈ దఫా ఆ పార్టీ ఓట్లను పెంచుకొంది. 

నాగార్జునసాగర్ నియోజకవర్గంలో తమకు పట్టులేకపోవడం కూడ ఓకారణంగా ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. హైద్రాబాద్ స్థానంలో బీజేపీ నాయకత్వం అతి విశ్వాసం కారణంగా ఓటమి పాలైందనే అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లో ఉంది. తెలంగాణలో టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని చెప్పుకొనే  బీజేపీకి సాగర్ ఎన్నికల ఫలితాలు రాజకీయంగా ఇబ్బందికరంగానే మారే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.