లక్ష మందితో బీజేపీ ‘హిందూ ఏక్తా యాత్ర’.. : బండి సంజయ్ కుమార్

BJP to hold Hindu Ekta Yatra: స్పీకర్, మండలి ఛైర్మన్ ల తీరుపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమార్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజ్యాంగ పదవిలో ఉంటూ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిలు దేశరాజధాని ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభానికి వెళ్లడం సిగ్గు చేటని మండిపడ్డారు. అలాగే, లక్ష మందితో ‘హిందూ ఏక్తా యాత్ర’ నిర్వహించనున్నట్టు తెలిపారు.
 

BJPs 'Hindu Ekta Yatra' with 1 lakh people in Karimnagar: Telangana BJP chief Bandi Sanjay Kumar RMA

BJP Telangana president Bandi Sanjay Kumar: హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 14న కరీంనగర్ లో హిందూ ఏక్తా యాత్రను నిర్వహించనున్నట్టు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తెలిపింది. ఈ యాత్రకు సుమారు లక్ష మంది హాజరవుతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. 

వివరాల్లోకెళ్తే.. తెలంగాణ బీజేపీ కరీంనగర్ లో హిందూ ఏక్తా యాత్రను నిర్వ‌హించ‌నుంది. ల‌క్షమంది ఇందులో భాగ‌మ‌వుతార‌ని రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ కుమార్ తెలిపారు. ఇందులో బీజేపీ శ్రేణుల‌తో పాటు పార్టీకి చెందిన కీల‌క నాయ‌కులు పాలుపంచుకుంటార‌ని పేర్కొన్నారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, తెలంగాణ బీజేపీ ఇంచార్జ్ తరుణ్ చుగ్, ఇతర నేతలు ఈ హిందూ ఏక్తా యాత్ర‌లో పాల్గొంటార‌ని స‌మాచారం. హిందూ ఏక్తా యాత్రలో హిందూ మత పరిరక్షణ కోసం పనిచేస్తున్న వారందరూ పాల్గొనాలని బండి సంజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ యాత్ర హిందువుల ఐక్యతను చాటుతుందని ఆయన అన్నారు.

ఈ ఏడాది చివరలో జరగనున్న తెలంగాణ‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మత ప్రాతిపదికన ఓట్లను చీల్చేందుకు బీజేపీ చేస్తున్న మరో ప్రయత్నంగా ఈ యాత్రను రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఎన్నికలకు మరికొన్ని నెలల సమయం ఉండటంతో కాషాయ పార్టీ తన ఓటు బ్యాంకును పటిష్టం చేసుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. వారిని రాజకీయంగా క్యాష్ చేసుకునేందుకు ఆ పార్టీ వివాదాస్పద అంశాలను లేవనెత్తుతోందని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. కర్ణాటకలో భజరంగ్ దళ్ ను నిషేధిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీని ఖండిస్తూ శుక్రవారం హైదరాబాద్ లోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం గాంధీభవన్ ముందు బీజేపీ హనుమాన్ చాలీసా పారాయణను నిర్వహించింది.

గాంధీభవన్ ఎదుట బీజేపీ, భజరంగ్ దళ్ కార్యకర్తలు పెద్ద ఎత్తున గుమిగూడి హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. అలాగే, అధికార భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి తామే ప్రత్యామ్నాయం అని ప్రూవ్ చేసుకోవాల‌నుకుంటున్న బీజేపీ, ఎన్నికల సమరానికి పార్టీని సమాయత్తం చేసేందుకు ఆ పార్టీ అగ్రనేతల వరుస పర్యటనలను ప్లాన్ చేస్తోంది. పలు అభివృద్ధి పథకాలను ప్రారంభించడానికి, బహిరంగ సభలో ప్రసంగించడానికి ప్రధాని నరేంద్ర మోడీ గత నెలలో హైదరాబాద్ వచ్చారు. ఆ తర్వాత హైదరాబాద్ సమీపంలోని చేవెళ్లలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బహిరంగ సభ జరిగింది.

రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసేందుకు ప్రతి నెలా బీజేపీకి చెందిన పలువురు కేంద్ర నాయకులను, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను బహిరంగ సభలు, ఇతర కార్యక్రమాలకు రప్పించాలని తెలంగాణ బీజేపీ యోచిస్తోంది. కాగా, దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాల‌యం ప్రారంభంపై బండి సంజ‌య్ స్పందిస్తూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. స్పీకర్, మండలి ఛైర్మన్ ల తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.  రాజ్యాంగ పదవిలో ఉంటూ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిలు దేశరాజధాని ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభానికి వెళ్లడం సిగ్గు చేటని మండిపడ్డారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios