తెలంగాణలో బీజేపీదే అధికారం: బండి సంజయ్ ధీమా
తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ధీమాను వ్యక్తం చేశారు.
హైదరాబాద్:తెలంగాణలో బీజేపీకి అనుకూలమైన వాతావరణం నెలకొందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ విజయకేతనం ఎగురవేస్తుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.
బుధవారంనాడు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కరీంనగర్ లో మీడియాతో మాట్లాడారు. నిన్న అమిత్ షా ఎన్నికల నగారాను మొగించారని చెప్పారు. రైతు బంధు ఇచ్చి మిగిలిన సబ్సీడీలను ఎత్తేశారని కేసీఆర్ సర్కార్ పై బండి సంజయ్ విమర్శలు గుప్పించారు.
కరీంనగర్ లో యువతను డ్రగ్స్, గంజాయికి అలవాటు చేస్తున్నారని ఆయన కేసీఆర్ సర్కార్ పై ఆరోపణలు చేశారు. రాజకీయాలు చేయాలి ... కానీ, యువత భవిష్యత్తుతో ఆడుకోవద్దన్నారు.తెలంగాణ ప్రజలే ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారని ఆయన చెప్పారు.దేశంలో ఎక్కడా లేని విచిత్ర పరిస్థితి తెలంగాణలో ఉందని బండి సంజయ్ చెప్పారు.
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో సీఎంఓ పనిచేస్తున్న రిటైర్డ్ ఉద్యోగులను కూడ బదిలీ చేయాలని బండి సంజయ్ కోరారు. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరి ద్వారా కేసీఆర్ డబ్బులను పంపేందుకు ప్రయత్నిస్తారని ఆయన ఆరోపించారు.ఈ విషయమై తాము ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.తెలంగాణ అంతటా ఎంఐఎం పోటీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణలో ఈ దఫా అధికారాన్ని దక్కించుకోవాలని బీజేపీ పట్టుదలగా ఉంది.ఈ విషయమై గత కొంతకాలంగా ఆ పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతుంది. గతంలో ఉత్తర్ ప్రదేశ్ లో పనిచేసిన సునీల్ భన్సల్ టీమ్ తెలంగాణలో పనిచేస్తుంది. తెలంగాణలో అధికారం దక్కించుకోవడం కోసం ఆ పార్టీ వ్యూహాలను రచిస్తుంది.ఈ నెల 1,3 తేదీల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటించారు.
ఈ నెల 6న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైద్రాబాాద్ లో నిర్వహించిన పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ప్రసంగించారు. నిన్న కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా ఆదిలాబాద్ లో నిర్వహించిన ఎన్నికల సభలో పాల్గొన్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడ త్వరలో రాష్ట్రంలో పర్యటించనున్నారు.