Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది..: టీఆర్ఎస్ పై బండి సంజయ్ విమ‌ర్శ‌లు

Hyderabad: తెలంగాణ‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) అధికారంలోకి వ‌స్తుంద‌ని రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ అన్నారు. ఐదో విడ‌త ప్ర‌జా సంగ్రామ యాత్ర‌లో భాగంగా నిర్మ‌ల్ లో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న పై వ్యాఖ్య‌లు చేశారు. అలాగే, అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు.
 

BJP will come to power in Telangana..: Bandi Sanjay criticizes TRS
Author
First Published Nov 30, 2022, 1:57 AM IST

TS BJP President Bandi Sanjay Kumar: దక్షిణాది రాష్ట్రమైన తెలంగాణ‌లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధికారంలోకి వస్తుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ధీమా వ్య‌క్తం చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌మ‌కు ప్ర‌జ‌లు అండ‌గా నిలుస్తార‌ని పేర్కొన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర ఐదో విడతలో భాగంగా నిర్మల్ జిల్లా భైంసా పట్టణ సమీపంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. రానున్న ఎన్నిక‌ల్లో గెలుపు త‌మ‌దేన‌ని పేర్కొన్నారు. తెలంగాణ‌లో బీజేపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. అలాగే, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌ల‌తో విరుచుకుపడిన బండి సంజయ్.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్‌గా ఉందనీ, అయితే ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) స‌ర్కారు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టింద‌ని ఆరోపించారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయితే మరో రూ.5 లక్షల కోట్ల అప్పులు చేస్తార‌ని ఆరోపించారు.

కాగా, అంత‌కుముందు భ‌ద్ర‌తా, వివిధ కార‌ణాల‌ను చూపుతూ బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ ప్ర‌జా సంగ్రామ యాత్ర‌కు పోలీసులు అనుమ‌తి నిరాక‌రించారు. దీంతో బీజేపీ కోర్టును ఆశ్ర‌యించ‌డంతో కొన్ని ష‌ర‌తుల‌తో అనుమ‌తి ల‌భించింది. తెలంగాణ హైకోర్టు విధించిన షరతుల మేరకు బీజేపీ బైంసాలో బహిరంగ సభను నిర్వహించింది. సోమవారం భైంసా పట్టణంలో మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రసంగించే భారీ బహిరంగ సభతో బండి సంజయ్ తన పాదయాత్రను ప్రారంభించాలని అనుకున్నారు. అయితే, మతపరమైన సున్నితమైన పట్టణంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందనే భయంతో పోలీసులు దీనికి అనుమతి నిరాకరించారు.

బీజేపీ నేత ఆదివారం రాత్రి భైంసాకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపారు. పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసుల చర్యను సవాల్ చేస్తూ బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు సోమవారం పాదయాత్రకు, బహిరంగ సభకు అనుమతినిస్తూ కొన్ని షరతులు విధించింది. భైంసాకు 3 కిలోమీటర్ల దూరంలో బహిరంగ సభ నిర్వహించగా, నిర్మల్ నుంచి సంజయ్ పాదయాత్ర ప్రారంభించడంతో కోర్టు ఆదేశాల మేరకు బీజేపీ పాదయాత్ర రూట్ మ్యాప్‌ను మార్చింది. బండి సంజయ్ తన ప్రసంగంలో.. భైంసాలోని హిందూ సమాజం భయపడాల్సిన అవసరం లేదనీ, బీజేపీ తమకు అండగా నిలుస్తుందని అన్నారు. బీజేపీకి ఓటేస్తే భైంసాను దత్తత తీసుకుంటామని హామీ ఇచ్చారు.

“భైంసా పాకిస్తాన్, బంగ్లాదేశ్ లేదా ఆఫ్ఘనిస్తాన్‌లో భాగమా? ఇక్కడికి రావాలంటే వీసా కావాలా’’ అంటూ బండి సంజ‌య్ ప్ర‌శ్నించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే భైంసా పేరును మైసాగా మారుస్తామని ప్రకటించారు. బీజేపీ అధికారంలోకి వస్తే పేదలందరికీ ఉచిత విద్య, వైద్యం అందిస్తామని బీజేపీ నేత పునరుద్ఘాటించారు. పేదలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జీ.కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్‌ పతనం ప్రారంభమైందన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్ ఒక్క సీటు కూడా గెలవర‌ని అని టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చేందుకు కేసీఆర్ ఎత్తుగడ వేస్తున్నారని దుయ్యబట్టారు. న‌రేంద్ర మోడీ మూడోసారి ప్రధాని అవుతారని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వెయ్యి మంది కేసీఆర్‌లు వచ్చినా, వెయ్యి మంది (అసదుద్దీన్) ఒవైసీలు వచ్చినా నరేంద్ర మోడీని అడ్డుకోలేరని ఆయన అన్నారు. తెలంగాణలో భాజపా అధికారంలోకి వస్తే అవినీతి కేసులన్నింటిపైనా విచారణ జరిపిస్తామని మంత్రి చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios