Asianet News TeluguAsianet News Telugu

ముల్లును ముల్లుతోనే..: కేసీఆర్ పై బిజెపి ప్రత్యేక వ్యూహం ఇదే...

ముల్లును ముల్లుతోనే తీయాలనే వ్యూహాన్ని బిజెపి తెలంగాణ ముిఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీద ప్రయోగించేందుకు సిద్ధపడింది. ఇందులో భాగంగా ఈటల రాజేందర్ వ్యాఖ్యలను తనకు అనుకూలంగా మలుచుకుంటోంది.

BJP to use BC card to face Telangana CM KCR
Author
Hyderabad, First Published Sep 10, 2019, 12:02 PM IST

మండల్ కమిషన్ రిపోర్ట్ వెలువడ్డ తరువాతి నుంచి దేశంలో కుల సమీకరణ రాజకీయాలు ఎక్కువయ్యాయి. ములాయం సింగ్ యాదవ్, లాలూప్రసాద్ యాదవ్ వంటి నేతలంతా ఈ తరహా మండల్ రాజకీయాలవల్ల ఎదిగిన వారే. 90వ దశకం నుంచి దేశ రాజకీయాల్లో కీలకంగా మారిన కులసమీకరణ రాజకీయాలను పటాపంచలు చేస్తూ బీజేపీ హిందుత్వ కార్డును ఉపయోగించి రెండు సార్లు అధికారాన్ని చేపట్టింది. 

ఉత్తర భారతంలో మనకు ఈ కుల రాజకీయాల ట్రెండ్ కొట్టొచ్చినట్టు  కనపడుతుంది. వ్యక్తి పేరు చివర ఉండే కులం ట్యాగును బట్టి అతడు ఓటు ఎవరికీ వేస్తాడో ఒక అంచనాకు రావచ్చు. బీజేపీ హిందుత్వ కార్డును ప్రయోగించినప్పటికీ వారు కూడా చేసింది కుల రాజకీయాలే. కానీ ఒక్క కులాన్ని మాత్రమే నమ్ముకోకుండా మెజారిటీ కులానికి వ్యతిరేకంగా మిగిలిన బీసీ కులాలన్నిటిని ఏకం చేయగలిగారు. బీహార్, ఉత్తర్ ప్రదేశుల్లో జరిగింది అదే. యాదవులకు వ్యతిరేకంగా మిగిలిన బీసీ కులాలన్నిటినీ తమవైపుగా తిప్పుకోగలిగింది బీజేపీ. 

దక్షిణాదిన కర్ణాటకను మినహాయిస్తే మిగిలిన రాష్ట్రాల్లో కుల రాజకీయాలు చాలా తక్కువ. ఒకింత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనపడ్డప్పటికీ తెలంగాణాలో మాత్రం చాలా తక్కువ. ఇలాంటి తెలంగాణాలో కొన్ని రోజులుగా కుల రాజకీయాలు మనకు కనపడుతున్నాయి. ముఖ్యంగా బీసీల ఐక్యతా కార్డు బాగా చర్చకు వస్తుంది. ఈటెల రాజేందర్ వ్యాఖ్యలతో ఈ విషయం మరోసారి తెరమీదకు వచ్చింది. 

ఉమ్మడి రాష్ట్రంలో గనుక తీసుకుంటే బీసీలు ఒకింత టీడీపీ మద్దతుదారులుగా ఉండేవారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తెలంగాణకు వ్యతిరేకంగా మోకాలడ్డిందని తెలిసినప్పటికీ వారికి చెప్పుకోదగ్గ సీట్లు రావడానికి ఈ బీసీల మద్దతే కారణం. ఈ విషయాన్ని పసిగట్టిన కెసిఆర్ వెంటనే ఈ బీసీల ఐక్యత కొనసాగితే తనకు కష్టమని భావించి, వారిని కులాలవారీగా విడతీసి ప్రత్యేక స్కీములను ప్రవేశపెట్టాడు. మత్స్యకారులకు చేప పిల్లల పంపిణీ నుండి గొల్లకురుమలకు గొర్రెల పంపిణీ వరకు ఈ స్కెచ్ లోని అంతర్భాగాలే. ఎంతకాదన్న కెసిఆర్ కూడా టీడీపీ స్కూల్ నుంచి వచినవాడే కదా!

ఈ విధంగా ముఖ్యమైన అన్ని కులాలకు వ్యక్తిగతంగా దగ్గరయ్యింది తెరాస. దీని ప్రతిఫలమేంటో మనం డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చూసాము కూడా. ఇక్కడివరకు బాగానే ఉంది. 2019 పార్లమెంటు ఎన్నికల ఫలితాలు వచ్చేంతవరకు బీజేపీ తెలంగాణాలో బలమైన శక్తి కాదు. కానీ ఎప్పుడైతే వారు 4 సీట్లను గెలిచారో వారు తెలంగాణపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ప్రారంభించారు.

ఉత్తరాది రాష్ట్రాల్లో మాదిరి ఇక్కడ హిందుత్వ అజెండాతో ముందుకెలితే గొప్ప ప్రయోజనం ఏమీ కలగదు. గెలుపు కోసం వారి ప్లానుల్లో హిందుత్వ ఒక రాజకీయ అస్త్రంగా ఉపయోగపడుతుందే తప్ప కేవలం హిందుత్వ అజెండానే వారిని గెలిపించలేదు. ఈ విషయాన్ని పసిగట్టిన బీజేపీ నూతన దారులను అన్వేషించడం మొదలుపెట్టింది. 

ఇందులో భాగంగానే బీజేపీ మరోమారు బీసీ అస్థిత్వాన్ని తెరమీదకు తీసుకొచ్చింది. మొన్న ఈటెల రాజేందర్ విషయంలో వారు చేసిన వ్యాఖ్యలు కూడా దీన్నే సూచిస్తుంది. ఈటెల భుజాలపైన తుపాకిని పెట్టి తెరాస పైన మాటలతూటాలను బాగానే పేల్చారు. బండి సంజయ్ వ్యాఖ్యలు గనుక పరిశీలిస్తే,  ఈటెల బయటకు రా, ఇది ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం అంటూ ఘాటుగా మాట్లాడాడు. బీజేపీ తన మైండ్ గేమ్ లో భాగంగా ఈటెల ద్వారా తెరాస ను టార్గెట్ చేయడమే కాకుండా బీసీల ఐక్యతారాగాన్ని కూడా వినిపించే ప్రయత్నం చేసారు. కేవలం ఐక్యతారాగమొక్కటే కాకుండా, బీసీ అస్థిత్వాన్ని కూడా ఒక  లెవెల్ లో ట్రిగ్గర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని మనకు అర్థమవుతుంది. 

ఇక్కడే బీజేపీకి ఒక కలిసొచ్చే అంశముంది. ప్రధాని నరేంద్రమోడీ ఒక బీసీ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా బీసీనే. మొన్ననే గవర్నర్ గా నియమితులైన బండారు దత్తాత్రేయ కూడా బీసీనే. వారికున్న 4 ఎంపీ సీట్లలో రెండింట గెలిచింది బీసీలే. ఇలా తమ పార్టీ బీసీలకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తుంది అని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. తాము అధికారంలోకి వస్తే బీసీనే ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 

ఇలా వారు బీసీలనందరిని తమవైపుగా తిప్పుకునేందుకు చేస్తున్న పనుల్లో భాగంగా ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలోని మున్నూరుకాపు సామాజికవర్గాన్ని తమవైపుగా ఆకర్షించే ప్రయత్నాలు చేస్తుంది. బలమైన బీసీ సామాజికవర్గాల నుండి వచ్చిన నేతలను తమవైపుగా తిప్పుకోవాలని వ్యూహాలను రచిస్తోంది. 

బీజేపీ అవలంబిస్తోన్న ఈ ప్లాన్ ని చూసే జాగ్రత్తపడి కెసిఆర్ ఈటెల రాజేందర్ కు ఉద్వాసన పలకలేదని అర్థమవుతుంది. నిన్నటి కేబినెట్ విస్తరణ తరువాత కొందరు నేతలు తమ అసహనాన్ని బాహాటంగానే ప్రకటించారు. పొరపాటున నోరు కూడా మెదపని తెరాస నేతలు ఇలా ధిక్కారస్వరాలను వినిపిస్తున్నారంటే కెసిఆర్ కొంత బలహీనపడ్డారేమో అనే అనుమానం కలుగకమానదు. 

ఇంతకుముందు తెరాస నేతలు పార్టీని వీడితే వారికి మరో బలమైన ఆశ్రయం కలిపించే పార్టీ లేదు ( నాయకత్వలేమి,కేంద్రంలో కూడా బాగా చతికిలపడడం, కెసిఆర్ ఆపరేషన్  ఇత్యాది కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీ అంత బలమైన పరిస్థితుల్లో లేదు). కానీ ఎప్పుడైతే బీజేపీ ఇక్కడ 4 ఎంపీ సీట్లను గెలిచిందో, బీజేపీ ఇప్పుడొక బలమైన ప్రత్యామ్నాయంగా కనపడుతుంది. తెరాస లోకి వెళ్లలేని ఇతర పార్టీల నాయకులు ఇప్పుడు బీజేపీలో చేరుతున్నారు. 

డీకే అరుణ నుంచి మొదలుకొని రేవూరి ప్రకాష్ రెడ్డి వరకు ఎందరో నేతలు ఇలా బీజేపీలో చేరారు. తెరాస నుంచి  జితేందర్ రెడ్డి వంటి నేతలు కూడా చేరిన విషయం మనందరికీ తెలిసిందే. ఇలా ఇంతమంది నేతలు చేరుతూ ఉండడం, కేంద్ర నాయకత్వం కూడా తెలంగాణపై స్పెషల్ ఇంటరెస్ట్ ని ప్రదర్శిస్తుండడం తో బీజేపీ ఒక ఆకర్షణీయమైన వెంచర్ గా నాయకులకు కనిపిస్తుంది. 

తెరాస లో అసమ్మతి బలంగా ఉందని ఎప్పటినుంచో చెబుతున్న బీజేపీ, తెరాస లో ఏ కొద్దిపాటి ధిక్కార స్వరం వినపడ్డా, వారిని తమవైపుకు తిప్పుకునేందుకు కాచుకొని కూచోని ఉంది. ఇలా ఇప్పుడు జోగు రామన్న వంటి నేతలు అసంతృప్తితో ఉండడం, జీవన్ రెడ్డి వంటి నేతలు ఖాళీగా ఉన్నాను, పనిలేకపోతే అమెరికా వెళ్తాను అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెరాస ఎంతమేర బీజేపీ ని ఎదుర్కుంటుందో వేచి చూడాలి.  

Follow Us:
Download App:
  • android
  • ios