గుజరాత్ స్పూర్తితో తెలంగాణలో అధికారంలోకి వస్తాం: బండి సంజయ్
గుజరాత్ ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ప్రభావం చూపుతాయని బీజేపీ తెలంగాణ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ చెప్పారు. గుజరాత్ లో గతంలో కంటే భారీ విజయం సాధించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు
నిర్మల్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చే ఏడాదిలో జరిగే తెలంగాణ ఎన్నికలపై ప్రభావం చూపుతుందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రజాసంగ్రామయాత్రను బండి సంజయ్ నిర్వహిస్తున్నారు. పాదయాత్రలో భాగంగా గురువారంనాడు బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ గతంలో ఎక్కువ స్థానాల్లో భారీ విజయం సాధించడం సంతోషంగా ఉందన్నారు. ప్రపంచం మొత్తం గుజరాత్ ఎన్నికల ఫలితాలను ఆసక్తిగా చూస్తున్నారన్నారు. గుజరాత్ లో బీజేపీని ఓడించేందుకు అన్ని పార్టీలు ఏకమైనా కూడా బీజేపీని ఓడించలేకపోయారని ఆయన చెప్పారు. మోడీని, బీజేపీని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను గుజరాత్ ప్రజలు తిప్పికొట్టారన్నారు. అబద్దాలు, తప్పుడు ప్రచారం చేసినా కూడా బీజేపీ వైపే ప్రజలు నిలిచారని బండి సంజయ్ చెప్పారు.గుజరాత్ ఎన్నికల ఫలితాలతో ప్రజాస్వామ్యవాదులు కూడా సంతోషంగా ఉన్నారని ఆయన చెప్పారు. ఎలాంటి అవినీతికి ఆస్కారం లేని పాలనను బీజేపీ అందిస్తుందన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ప్రజలకు మంచి ఫలితాలు వస్తాయన్నారు.
also read:32 ఏళ్లుగా అధికారానికి కాంగ్రెస్ దూరం: గుజరాత్‌లో ఉనికి కోసం కాంగ్రెస్ పోరాటం
గుజరాత్‌లోని మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం కావడంతో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ ఫలితం వస్తుందోనన్న ఆసక్తి దేశవ్యాప్తంగా నెలకొంది. 27 ఏళ్లుగా గుజరాత్ బీజేపీకి కంచుకోటగా ఉంది. ఇక, మొదటి విడతలో డిసెంబర్ 1న 89 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈ దశలో సౌరాష్ట్ర, కచ్, రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతాల్లోని 19 జిల్లాల్లోని 89 అసెంబ్లీ స్థానాలకు ఎన్నిక జరిగింది. ఎన్నికలలో బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలతో సహా మొత్తం 39 రాజకీయ పార్టీలు అభ్యర్థులను నిలిపాయి. 89 అసెంబ్లీ స్థానాల బరిలో మొత్తం 788 మంది అభ్యర్థులు నిలిచారు. మొదటి దశలో మొత్తం ఓటింగ్ శాతం 63.14గా నమోదైందని ఎన్నికల సంఘం తెలిపింది.
మొదటి విడతలో బరిలో నిలిచిన ప్రముఖుల్లో ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదన్ గాధ్వి- ఖంభాలియా నుంచి, క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా(బీజేపీ)- జామ్‌నగర్ నార్త్ నుంచి, బీజేపీ నేత కాంతిలాల్ అమృతియా- మోర్బి నుంచి, మాజీ మంత్రి, బీజేపీ నేత పర్షోత్తమ్ సోలంకి - భావ్‌నగర్ రూరల్ నుంచి బరిలోఉన్నారు.
ఇక, రెండో విడతలో అహ్మదాబాద్, వడోదర, గాంధీనగర్‌తో సహా మధ్య గుజరాత్‌లోని 14 జిల్లాల్లోని 93 స్థానాల్లో పోలింగ్ జరిగింది. రెండో దశలోని మొత్తం 93 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను నిలిపింది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ కూడా మొత్తం 93 స్థానాల్లో పోటీ చేస్తోంది. కాంగ్రెస్ 90 స్థానాల్లో పోటీ చేయగా.. దాని మిత్రపక్షమైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) రెండు స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపింది.
ఈ దశలో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ (ఘట్లోడియా), పాటిదార్ నాయకుడు హార్దిక్ పటేల్ (విరాంగమ్), ఓబిసి నాయకుడు అల్పేష్ ఠాకోర్ (గాంధీనగర్ సౌత్), మాజీ మంత్రి శంకర్ చౌదరి (తారద్), జిగ్నేష్ మేవానీ (వడ్గం) ఉన్నారు. హార్దిక్ పటేల్, అల్పేష్ ఠాకోర్, శంకర్ చౌదరిలు బీజేపీ నుంచి పోటీలో ఉండగా, కాంగ్రెస్ నుంచి మేవానీ బరిలో ఉన్నారు. అహ్మదాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఓటును వినియోగించుకున్నారు.
గుజరాత్‌లో బీజేపీ రికార్డు స్థాయిలో ఏడోసారి అధికారంలోకి రావాలని చూస్తోంది. అయితే కాంగ్రెస్, ఆప్‌లు కూడా బీజేపీకి గట్టి పోటీనిస్తున్నాయి. మోదీ బీజేపీ తరపున భారీ స్థాయిలో ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు సభల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా భారత్ జోడో యాత్ర నుంచి విరామం తీసుకుని గుజరాత్ ఎన్నికల్లో పార్టీ కోసం ప్రచారం నిర్వహించారు. ఆప్ అభ్యర్థుల తరపున కేజ్రీవాల్ ప్రచారం నిర్వహించారు.