హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఫామ్ హౌస్ మీద బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పదే పదే ఫామ్ హౌస్ కు వెళ్లడం అనుమానాలకు తావిస్తోంందని ఆయన అన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ ను చెక్ చేయాలని ఆయన అన్నారు. కేంద్రం నుంచి నిధులు రాలేదనే టీఆర్ఎస్ విమర్శలకు ఆయన సమాధానమిచ్చారు. 

ప్రధాని అవాస్ యోజన కింద ఇచ్చిన నిధులు ఎక్కడికి వెళ్లాయని సంజయ్ అడిగారు. బిజెపి గాలిలో గెలిచిందో.. టీఆర్ఎస్ గాలిలో కొట్టుకుపోతుందో అందరూ చూస్తున్నారని ఆయన అన్నారు. కేసీఆర్ ను జైలులో పెట్టే రోజులు త్వరలో వస్తుందని ఆయన అన్నారు. కేసీఆర్ లేని తెలంగాణ కావాలని ప్రజలు భావిస్తున్నారని, అది బిజెపి వల్లనే సాధ్యమని ఆయన అన్నారు. 

ఎంఐఎం నేతలు తుపాకులతో నానా యాగీ చేస్తున్నా హోం మంత్రి ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తుతోందని, ముఖ్యమంత్రి కేసీఆర్ అందుకు బాధ్యత వహించాలని ఆయన అన్నారు. ఐపిఎస్ అధికారులను అవమానించేలా టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. 

ఈ ప్రభుత్వ హయాంలో పనిచేయలేమని పోలీసులు బాహాటంగానే చెబుతున్నారని ఆయన అన్నారు ఆదిలాబాద్ జిల్లా ఎంఐఎం అధ్యక్షుడు, మున్సిపల్ మాజీ వైఎస్ చైర్మన్ ఫారూఖ్ అహ్మద్ రివాల్వర్ తో కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

భైంసాలో హిందువుల ఇళ్లను దగ్ధం చేసినా కూడా పట్టించుకోలేదని, ఎంఐఎం గుండూలా రోజురోజుకూ రెచ్చిపోతున్నారని, నానా యాగీ చేస్తున్నారని, అయినా హోం మంత్రి పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. హైదరాబాదులోని పాతబస్తీలో గల కాళీమాత భూములను కబ్జా చేసేందుకు ఎంఐఎం నేతలు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. దేవాదాయ భూములను కాపాడాలని తమ పార్టీ నేతలూ కార్యకర్తలూ కోరితే వారిని పోలీసులు అరెస్టు చేశారని ఆయన అన్నారు