హైదరాబాద్: ఆకస్మాత్తుగా కేసీఆర్ కు రైతులపై ఎందుకు ప్రేమ వచ్చిందో అర్ధం కావడం లేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.

మంగళవారం నాడు హైద్రాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేసీఆర్ చావు దెబ్బ తిన్నాడన్నారు.ప్రజల దృష్టిని మరల్చేందుకు గాను రైతు సంఘాల బారత్  బంద్ కు టీఆర్ఎస్ మద్దతు ప్రకటించిందని ఆయన విమర్శించారు.

also read:తలుపులు మూసి వ్యవసాయ చట్టాలను ఆమోదించుకొన్నారు: బీజేపీపై కేటీఆర్

రైతుల సమస్యలపై ప్రేమ ఉన్న ముఖ్యమంత్రి ఎందుకు బయటకు రాలేదని ఆయన ప్రశ్నించారు. ఫామ్ హౌస్ లోనో, ప్రగతి భవన్ కే ఎందుకు పరిమితమయ్యాడో చెప్పాలని ఆయన కోరారు.కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఇంతకాలం పాటు కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు ఆందోళనలు చేయలేదో చెప్పాలన్నారు.

నూతన వ్యవసాయ చట్టాలను ఎందుకు వ్యతిరేకిస్తున్నావని 3 లక్షల మంది రైతులు కేసీఆర్ కు లేఖలు రాశారని ఆయన చెప్పారు. ఈ చట్టాలను సమర్ధించాలని రైతులు కేసీఆర్ ను కోరారని ఆయన గుర్తు చేశారు.

భారత్ బంద్ కు ఆకస్మాత్తుగా టీఆర్ఎస్ ఎందుకు మద్దతును ప్రకటించిందో అర్ధం కావడం లేదన్నారు.#పండించిన పంటకు రైతే ధర నిర్ణయించుకోవడం తప్పా అని ఆయన ప్రశ్నించారు. దీన్ని వ్యతిరేకిస్తావా అన్నారు.పండించిన పంటను ఎక్కడైనా అమ్ముకోవడాన్ని వ్యతిరేకిస్తావా అని ఆయన అడిగారు.