హైదరాబాద్: ఎన్నికల మేనిఫెస్టో సందర్భంగా టీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు,. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కౌంటరిచ్చారు. 

సోమవారం నాడు తెలంగాణ భవన్ లో జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోను కేసీఆర్ విడుదల చేశారు.ఈ సందర్భంగా పరోక్షంగా బీజేపీపై కేసీఆర్ విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలకు బండి సంజయ్ ఘాటుగా స్పందించారు.

కేసీఆర్‌‌ – ఈ నగరానికి ఒక చరిత్ర, వారసత్వం, వైవిధ్యమైన సంస్కృతి, విలక్షణమైన జీవినవిధానం ఉన్న మహా నగరం ఈ నగరం....

 బండి సంజయ్ – ఇలాంటి మహానగరంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేవు. వరదలొస్తే పట్టించుకొనే ప్రభుత్వం లేదు. రోజూ నిమ్మలంగా పోదామంటే రోడ్లు సక్కగా లేవు. ఇన్ని సమస్యలు ఉన్న ఈ మహానగరం.. ఒక మహా నరకం...

కేసీఆర్– డిసెంబర్ నుంచి 20 వేల లీటర్ల వరకు  ఉచితంగా మంచినీటి సరఫరా చేస్తాం.

 బండి సంజయ్ – వరద నీళ్ల సంగతేంది అని మేం అడుగుతుంటే.. మీరు ముచ్చట నీళ్ల బిల్లు మీదికి డైవర్ట్ చేసిన్రు... అయినా.. ఇన్నేండ్ల నుంచి లేంది ఎన్నికల ముందు గుర్తొచ్చిందా ఈ నీళ్ల ముచ్చట...

కేసీఆర్‌‌–  దేశంలో చాలాచోట్ల కనిపించవుగానీ, మన హైదరాబాద్‌లో  గుజరాతీ గల్లీ ఉంటది. పార్సి గుట్ట ఉంటది, సిందీ కాలనీ ఉంటది, అరబ్ గల్లీ ఉంటది. ఒక అందమైన పూలబొకే లాంటి నగరం హైదరాబాద్‌!

 బండి సంజయ్ – వీటన్నింటితో పాటు ప్రతి గల్లీలో టీఆర్‌‌ఎస్ అరాచకం ఉంటుంది. పూలబొకే లాంటి నగరాన్ని  కరోనాతో కాటు వేయించారు. వరదల్లో ముంచేశారు. అబద్దాలతో ఆడించారు. దొరికినకాడికి దోచుకొని... పూలబొకే లాంటి నగరాన్ని నలిపేశారు...

కేసీఆర్‌‌–  రావుగారు  హైదరాబాద్‌ ఇండియన్ ఫిల్మ్‌ హబ్‌ అవుతుంది. అది మీతోనే సాధ్యం అని అమితాబ్‌గారు వచ్చి నాతో అన్నారు.
బండి సంజయ్ –  ఇప్పటికే చాలా హబ్‌లు క్రియేట్‌ చేసిన్రు. ఇదొక్కటే తక్కువ!!

కేసీఆర్‌‌–  వానలొస్తే సిటీలు అన్ని మునిగిపోతున్నయ్. దీనికి మీరిన్ని, మేమిన్ని పైసలు ఏసుకొని ఇట్ల చేద్దాం, అట్లా చేద్దాం అని నేను చెప్పిన. కానీ, కేంద్రం పెడచెవిన పెట్టింది. వాళ్లు చేస్తరనే నమ్మకం లేదు. ఈ సారి మేమే చేస్తం, మాస్టర్ ప్లాన్ గీస్తున్నం, మేనిఫెస్టోలో పెడుతున్నం!

 బండి సంజయ్ – నీ డ్రామాలు బంజెయ్‌ .. జర బంజెయ్... ఇయ్యాళ గుర్తుకొచ్చింది ..  
 మీకు  ఇన్నేండ్ల నుంచి మీరు చేస్తం అంటే ఎవరన్నా ఆపిన్రా?

కేసీఆర్‌‌– పాపం నేనే టీవీల చూసిన.. మోకాళ్ల లోతుల నీళ్లు మంచం తేలుతున్నది. నాకే మనసు బాధైంది. దసరా మన సెంట్‌మెంట్ పండుగ. కాబట్టి, తప్పకుండా చేసుకోవాలె. ఏమన్నా కొనుక్కుంటరని పది వేల రూపాయలు ఇచ్చిన. 

బండి సంజయ్– దసరాకు ఇస్తా అని.. దీపావళి దాటినంక, ఎన్నికల ముందు ఇచ్చినవ్‌. సరే.. అందరికీ ఇచ్చినవా అంటే అదీ లేదు!

కేసీఆర్‌‌– జీహెచ్‌ఎంసీ ఎన్నికలల్ల వేరేటోళ్లు గెలిచినా చేసేదేం లేదు. రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత ఉంటది. మా సహకారం లేకుండా ఎవ్వరూ ఏం చేయలేరు!
బండి సంజయ్‌– గా బాధ్యతను గుర్తు చేయడానికి, నీ అధికార అహంకారాన్ని దించడానికే మిమ్మల్ని ఓడిస్తరు సారు...

కేసీఆర్ - లక్ష ఎలక్ట్రిక్ వెహికిల్స్ రోడ్డు మీదకు తీసుకొస్త...పొల్యూషన్ పోగొడ్త!

బండి సంజయ్ - లక్ష బెడ్రూమ్‌లు అన్నడు పోయిన ఎలక్షన్లకు..లక్షణంగా మోసం చేయడానికి మళ్ల లక్ష మాటలు చెప్పిపోయిండు ఇయ్యాళ