హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉంటూ రెండోసారి తండ్రి కేసీఆర్ మంత్రివర్గంలో చేరిన కేటీ రామారావుకు నగరపాలక సంస్థల ఎన్నికలు సవాల్ విసరనున్నాయి. గతంతో పోలిస్తే ఎన్నికలు టీఆర్ఎస్ కు ఆషామాషీ వ్యవహారం కాదనిపిస్తోంది. బిజెపి తన వ్యూహాలకు పదును పెడుతూ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ దూకుడుగా వ్యవహరిస్తోంది. అదే సమయంలో కాంగ్రెసు తన బలాన్ని ప్రదర్శించడానికి సిద్ధపడుతోంది. 

లోకసభ ఎన్నికల్లో హరీష్ రావును పక్కన పెట్టి అంతా తానై వ్యవహరించిన కేటీఆర్ కు ఎదురు దెబ్బ తప్పలేదు. 17 లోకసభ స్థానాలకు జరిగి ఎన్నికల్లో 8 సీట్లను టీఆర్ఎస్ కోల్పోయింది. లోకసభ ఎన్నికల తర్వాత బిజెపిలో చేరికలు పెరిగాయి. దాంతో వచ్చే  మున్సిపల్ ఎన్నికల్లో పలువురు బిజెపి సీనియర్ నేతలు తన బలాలను ప్రదర్శించడానికి సిద్ధపడుతున్నారు.

లోకసభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 సీట్లలో 16 సీట్లను కైవసం చేసుకుంటామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. పైగా సారు, కారు, సర్కారు నినాదంతో ముందుకు వెళ్లి మెజారిటీ స్థానాలను గెలుచుకోవడం ద్వారా ఇతర ప్రాంతీయ పార్టీలతో జత కట్టి ఢిల్లీలో కీలక పాత్ర పోషించాలని భావించారు. లోకసభ ఎన్నికల్లో బిజెపికి గానీ కాంగ్రెసుకు గానీ 250 సీట్లకు మించి రావని, మోడీ తిరిగి అధికారంలోకి రావడానికి 150 సీట్ల దాకా తక్కువ పడుతాయని, పరిస్థితిని ఆసరా చేసుకుని ఢిల్లీలో పాగా వేయాలని కేసీఆర్ భావించారు. 

అయితే, కేసీఆర్ అంచనాలు తప్పాయి. బిజెపి తిరుగులేని మెజారిటీ సాధించడమే కాకుండా రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ఎదురు దెబ్బ తగిలింది. అయితే, లోకసభ ఎన్నికల్లో జాతీయాంశాలు ప్రధాన పాత్ర పోషించాయని, దానికి తోడు రాష్ట్రంలో బిజెపి, కాంగ్రెసు కుమ్మక్కయ్యాయని, దానివల్ల తమకు వ్యతిరేక ఫలితాలు వచ్చాయని కేటీఆర్ భావిస్తున్నారు. నగరపాలక సంస్థల ఎన్నికలు అందుకు భిన్నంగా ఉంటాయని కూడా అనుకుంటున్నారు. 

కానీ, టీఆర్ఎస్ మునుపటిలా పటిష్టంగా లేదు. సౌమ్యుడిగా పేరు పొందిన మంత్రి ఈటల రాజేందర్ బాహాటంగా అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆయనకు బీసీ నేతలు మద్దతు కూడా పలికారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఈటలకు మద్దతు పలికారు. మంత్రివర్గ విస్తరణ తర్వాత మరి కొంత మంది ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. దాన్ని బట్టి కేసీఆర్ మాటే శాసనమనే పరిస్థితి టీఆర్ఎస్ లో కొనసాగే అవకాశం లేదని అర్థమవుతోంది. 

బిజెపి దూకుడు పెంచిన నేపథ్యంలో పార్టీ నాయకులు మాత్రమే కాకుండా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా బిజెపి వైపు చూసే వాతావరణ నెలకొంది. ఈ స్థితిలో మున్సిపల్ ఎన్నికలు కేటీఆర్ కు పెద్ద సవాల్ నే విసరనున్నాయి. రాష్ట్రంలోని 13 మున్సిపల్ కార్పోరేషన్లకు, 124 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. 

అయితే, లోకసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఎదురు దెబ్బ తగిలినప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల్లో తన హవాను చాటుకుంది. అలాగే, నగర పాలక సంస్థల ఎన్నికల్లో కూడా తమ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందనే ధీమాతో టీఆర్ఎస్ అధినాయకత్వం ఉంది. ధీమాను వ్యక్తం చేస్తున్నప్పటికీ నగరపాలక సంస్థల ఎన్నికలు కేటీఆర్ కు నల్లేరు మీద నడక కాదని అంటున్నారు.