తెలంగాణ పర్యటనకు విచ్చేసిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్‌తో సమావేశమయ్యారు.
తెలంగాణ పర్యటనకు విచ్చేసిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్‌తో సమావేశమయ్యారు. సంపర్క్ సే అభియాన్‌లో ఈ భేటీ జరిగింది. టోలిచౌక్‌లోని ప్రొఫెసర్ నాగేశ్వర్ నివాసానికి వెళ్లిన జేపీ నడ్డా.. మోదీ తొమ్మిదేళ్ల పాలనలో అభివృద్దిపై రూపొందించిన పుస్తకాన్ని ఆయనకు అందజేశారు. అనంతరం కొద్దిసేపు ప్రొఫెసర్ నాగేశ్వర్‌తో మాట్లాడారు. జేపీ నడ్డా వెంట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాజ్యసభ సభ్యులు కే లక్ష్మణ్‌తో పాటు కొందరు ముఖ్యనేతలు కూడా ఉన్నారు.
ఇదిలా ఉంటే.. ఈరోజు మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న జేపీ నడ్డాకు బండి సంజయ్, కే లక్ష్మణ్‌తో పాటు పలువురు ముఖ్య నేతలు స్వాగతం పలికారు. అనంతరం జేపీ నడ్డా నోవాటెల్‌కు చేరుకున్నారు. అక్కడ జేపీ నడ్డా.. టీ బీజేపీ ముఖ్య నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, విజయశాంతి, రఘునందన్ రావు, మురళీధర్ రావు, వివేక్‌లతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై వారితో సమాలోచనలు జరిపారు.
రాష్ట్రంలోని పరిస్థితులపై నేతలతో చర్చించిన జేపీ నడ్డా.. అసెంబ్లీ ఎన్నికలకు సిద్దం కావాలని దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. బీఆర్ఎస్‌తో రాజీలేదని.. సీరియస్ ఫైట్ ఉంటుందని స్పష్టం చేశారు. అదే సమయంలో పార్టీ లైన్ దాటి మాట్లాడొద్దని నేతలకు జేపీ నడ్డా ఆదేశించినట్టుగా తెలుస్తోంది. పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవని హెచ్చరించినట్టుగా సమాచారం.
ఇక, జేపీ నడ్డా హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో సాయంత్రం 5 గంటల ప్రాంతంలో నాగర్‌కర్నూల్‌కు చేరుకుంటారు. మహాజన సంపర్క్ అభియాన్‌లో భాగంగా నాగర్ కర్నూలులో జరిగే నవ సంకల్ప సభలో ఆయన పాల్గొననున్నారు. దాదాపు గంటసేపు జేపీ నడ్డా.. నాగర్‌కర్నూలులో జరిగే నవ సంకల్ప సభలో ఉండనున్నారు. అనంతరం తిరిగి హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు చేరుకుంటారు. రాత్రి 7.40 గంటల సమయంలో శంషాబాద్ విమానాశ్రయం నుంచి కేరళ రాజధాని తిరువనంతపురంకు వెళ్లనున్నారు.
ఇక, టీ బీజేపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో జేపీ నడ్డా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ రాష్ట్ర నాయకత్వ తీరుపై అసంతృప్తితో ఉన్న ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు.. అధిష్టానంతో చర్చలు జరిపేందుకు శనివారం ఢిల్లీ వెళ్లారు. ఈ క్రమంలోనే వారు జేపీ నడ్డా, అమిత్ షాలను కలిసి చర్చలు జరిపారు. అయితే ప్రస్తుతం వారు ఢిల్లీలోనే ఉండటంతో.. జేపీ నడ్డా పర్యటనకు దూరంగా ఉండిపోయారు.
