Asianet News TeluguAsianet News Telugu

జగన్‌తో స్నేహం, కేసీఆర్ తో కయ్యం: బీజేపీ ప్లాన్ ఇదీ.....

దక్షిణాదిలో బలపడేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. ఏపీ రాష్ట్రం కంటే తెలంగాణపై బీజేపీ ఎక్కువగా కేంద్రీకరించింది.

BJP prefers Jagan Mohan Reddy over K Chandrashekhar Rao in south
Author
Hyderabad, First Published Aug 22, 2019, 7:01 AM IST

హైదరాబాద్:దక్షిణాది రాష్ట్రాల్లో బలోపేతం కావాలని బీజేపీ వ్యూహత్మకంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే కర్ణాటకలో బీజేపీ అధికారాన్ని హస్తగతం చేసుకొంది. రెండు తెలుగు రాష్ట్రాలపై ఇప్పుడు కేంద్రీకరించింది. అయితే తెలంగాణలో అధికారం కోసం పావులు కదిపే సమయంలో ఏపీ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ తో మాత్రం స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించాలని ఆ పార్టీ భావిస్తోంది.

ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుండి బీజేపీ నాలుగు ఎంపీ స్థానాలను గెలుచుకొంది.ఓట్ల శాతం కూడ బాగా పెరిగింది.దీంతో తెలంగాణపై బీజేపీ ప్రస్తుతం కేంద్రీకరించింది. తెలంగాణతో పాటే ఏపీ రాష్ట్రంలో కూడ బలపడేందుకు ఆ పార్టీ పావులు కదుపుతోంది.

కేసీఆర్, వైఎస్ జగన్ లలో తనకు టీఆర్ఎస్ చీఫ్ కంటే కూడ వైఎస్ఆర్‌సీపీ చీఫ్ జగన్ అత్యంత నమ్మకమైన మిత్రుడుగా కాషాయదళళం భావిస్తోంది.

అంతరాష్ట్రమండలి స్టాండింగ్ కమటీ సభ్యుడిగా ఏపీ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ ను బీజేపీ సర్కార్ నియమించింది.దక్షిణ భారతదేశం నుండి వైఎస్ జగన్ కు మాత్రమే ఈ స్థానం దక్కింది. ఈ కమిటీకి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చైర్మెన్ .

పరిపాలనలో, అనుభవంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ కంటే కేసీఆర్ సీనియర్.అయితే అంతరాష్ట్ర మండి సభ్యుడిగా జగన్ ను నియమించడంలో మోడీ సర్కార్ వ్యూహత్మకంగానే ముందుకు వెళ్లినట్టుగా అర్ధం అవుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

కేసీఆర్ తో పోరాటం చేసే సమయంలో జగన్ తో స్నేహం చేయాలనే ఉద్దేశ్యంతోనే బీజేపీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకొని ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు రాష్ట్రాల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు ఈ కమిటీ పనిచేస్తోంది.ఈ కమిటీలో ఏపీ సీఎం వైఎస్ జగన్ తో పాటు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ బీహార్ సీఎం నితీష్ కుమార్ ఉన్నారు. ఈ కమిటీలో బీజేపీ సీఎంలకు చోటు దక్కలేదు. నితీష్ కుమార్ ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు. 

2014-19 మధ్యకాలంలో తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోడీ మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఉండేవి. 2019లో కేంద్రంలో మోడీ రెండో సారి అధికారంలోకి వచ్చాడు. 2018లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో కేసీఆర్ అధికారాన్ని నిలుపుకొన్నాడు.

అయితే రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరవాత కేసీఆర్, మోడీల మధ్య అగాధం పెరుగుతుంది.లోక్‌సభ ఎన్నికల సమయంలో కేసీఆర్ అనుసరించిన వ్యూహం కూడ కారణంగా చెబుతున్నారు. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా పార్టీలను కూడగట్టేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయత్నించాడు. 

 దేశంలోని పలు పార్టీల నేతలు, ఆయా రాష్ట్రాల సీఎంలను కేసీఆర్ కూడగట్టే ప్రయత్నం చేశారు. కానీ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడం సాధ్యం కాలేదు. ఎన్నికల సమయంలో కూడ కేసీఆర్ ప్రధాని మోడీపై తీవ్రమైన విమర్శలు చేశారు .

గత టర్మ్ లో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు కంటే కూడ తెలంగాణ సీఎం కేసీఆర్ తో బీజేపీ కొంత నమ్మకంగా ఉండేది. ప్రధాని మోడీతో పాటు బీజేపీ నేతలతో కూడ కేసీఆర్ సన్నిహితంగా ఉండేవాడు.

ప్రధాని మోడీతో సమావేశం కోసం అప్పటి ఏపీ సీఎం చంద్రబాబునాయడు ఏడాదిపాటు వేచి చూస్తే తెలంగాణ సీఎం కేసీఆర్ పలు దఫాలు పీఎంతో సమావేశమయ్యారు.అయితే మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా తెలుగు రాష్ట్రాల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ వైపు బీజేపీ చూస్తోంది. 

తెలంగాణలో కాంగ్రెస్ రోజు రోజుకు బలహీనపడుతోంది. అదే సమయంలో పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఓటింగ్ శాతం కూడ దృష్టిలో ఉంచుకొని తెలంగాణలో పార్టీపై బీజేపీ ఎక్కువగా కేంద్రీకరించింది.


 

Follow Us:
Download App:
  • android
  • ios