తెలంగాణ భవితవ్యం మారబోతుంది..: కేటీఆర్‌ వ్యాఖ్యలకు ప్రకాష్ జవదేకర్ కౌంటర్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ డిపాజిట్ కోల్పోతుందని రాష్ట్ర మంత్రి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది.

BJP Prakash Javadekar reacts to KTR losing remark ksm

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ డిపాజిట్ కోల్పోతుందని రాష్ట్ర మంత్రి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది. రానున్న ఎన్నికల్లో 110 మందికి పైగా బీజేపీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోతారని కేటీఆర్ విమర్శించడంపై బీజేపీ ఎంపీ, ఆ పార్టీ తెలంగాణ ఎన్నికల ఇంచార్జ్ ప్రకాష్ జవదేకర్ స్పందిస్తూ.. బీజేపీ విజయంపై ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం విడుదల చేసిన తేదీలు.. తెలంగాణ భవితవ్యం మారే తేదీలని, బీజేపీ విజయం సాధించే తేదీలని ప్రకాష్ జవదేకర్ పేర్కొన్నారు. 

‘‘తెలంగాణ శాసనసభలో తొమ్మిది స్థానాలను (తెలంగాణ అసెంబ్లీలో మొత్తం 119 స్థానాలు) కేటీఆర్ ఎందుకు వదిలేశారు? తెలంగాణ భవితవ్యం మారనున్న తేదీలను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈసారి తెలంగాణలో బీజేపీ విజయం సాధిస్తుంది’’ అని ప్రకాష్ జవదేకర్ ధీమా వ్యక్తం చేశారు. 

ఇటీవల తెలంగాణలోని ఆదిలాబాద్‌లో జరిగిన ‘జన గర్జన సభలో’ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రసంగిస్తూ కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్‌కు ఆయన కుమారుడు కేటీఆర్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యమని మండిపడ్డారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. రాష్ట్రంలో ప్రజలను తప్పుదోవ పట్టించడం సాధ్యమయ్యే పని కాదని.. నవంబర్ 30 జరగనున్న ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల్లో 110 మందికి పైగా డిపాజిట్లు కోల్పోతారని విమర్శించారు. 

భారత్ లో తలసరి ఆదాయం 300 శాతానికి పైగా పెరిగిన రాష్ట్రం పేరు చెప్పాలని అమిత్ షాను కోరుతున్నామని అన్నారు. అలాంటి బీజేపీ పాలిత లేదా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాన్ని త‌మ‌కు చూపించాల‌ని డిమాండ్ చేశారు. అపూర్వమైన అభివృద్ధి సాధిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని.. తెలంగాణ కంటే మెరుగైన పనితీరు కనబరిచిన బీజేపీ పాలిత రాష్ట్రాన్ని చూపించాలని సవాలు చేశారు. 

ఇక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నిల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో రాజకీయం మరింతగా వేడెక్కింది. తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ జరగనుండగా.. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios