హైదరాబాద్: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసే అభ్యర్ధిని బీజేపీ ఇంకా ప్రకటించలేదు.  సోమవారం నాడు రాత్రికి బీజేపీ అభ్యర్ధిని ప్రకటించే అవకాశం ఉంది.

టీఆర్ఎస్ సీటు ఆశించి ఆ సీటు దక్కని నేతతో బీజేపీ సంప్రదింపులు జరుపుతోందనే ప్రచారం సాగుతోంది. నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో ఎవరిని బరిలోకి దింపాలనే విషయమై బీజేపీ నాయకత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

టీఆర్ఎస్ అసంతృప్త నేతలకు గాలం వేయాలని బీజేపీ నాయకత్వం ప్లాన్ చేసినట్టుగా ప్రచారం సాగుతోంది. అయితే టీఆర్ఎస్ అసంతృప్తులు ఎవరు బీజేపీ వైపు మళ్లుతారనే విషయమై ఇప్పటికిప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

also read:నాగార్జునసాగర్ బైపోల్: కోటిరెడ్డికి ఎమ్మెల్సీ పదవికి కేసీఆర్ హామీ

బీజేపీ నుండి డాక్టర్ రవికుమార్,  ఇంద్రసేనారెడ్డి, నివేదితారెడ్డి, కడారి అంజయ్య యాదవ్ లు సీటును ఆశిస్తున్నారు. నివేదితా రెడ్డి ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసింది.నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులు ఈ నెల 30వ తేదీ వరకే నామినేషన్ దాఖలు చేసేందుకు చివరి తేది. అయితే బీజేపీ ఇంకా అభ్యర్ధిని ఫైనల్ చేయలేదు.

బీజేపీ నేతలు ఇవాళ ఆన్‌లైన్ లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నాగార్జునసాగర్ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దింపే అభ్యర్ధిపై చర్చించారు. ఇవాళ రాత్రికి అభ్యర్ధిని ఫైనల్ చేసే అవకాశం ఉంది.