Asianet News TeluguAsianet News Telugu

రేపు హీరో నితిన్‌తో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా భేటీ.. సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ

శనివారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో హీరో నితిన్ భేటీ కానున్నారు. ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్‌తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ అయిన నేపథ్యంలో తాజాగా నితిన్‌తో నడ్డా సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. 

bjp national president jp nadda to meet hero nitin on tomorrow
Author
First Published Aug 26, 2022, 8:05 PM IST

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ తనదైన యాక్షన్ ప్లాన్ రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో తెలుగు నాట బలమైన ఫ్యాన్ బేస్ వున్న సినీ తారలను మచ్చిక చేసుకునే పనిలో పడింది. దీనిలో భాగంగా ఇప్పటికే గత వారం టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. ఈ కలయిక తెలుగు రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. తాజాగా మరో యువ హీరో నితిన్‌తో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భేటీ కానున్నారు. రేపు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగియనున్న నేపథ్యంలో వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు శనివారం హైదరాబాద్‌కు రానున్నారు జేపీ నడ్డా. ఈ క్రమంలోనే నితిన్‌తో ఆయన భేటీ కానున్నారు. 

ఇకపోతే.. కేంద్ర హోం మంత్రి, బిజెపి నేత అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ కావడం తెలంగాణ రాజకీయాలకు సంబంధించి కీలకమైన మలుపుగా భావించవచ్చు. తెలంగాణలో పాగా వేయాలని చూస్తున్న బిజెపి వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల మద్దతు పొందేందుకు ప్రయత్నిస్తోంది. ప్రముఖ దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కు రాజ్యసభ సీటు ఇవ్వడం ఇందులో భాగమేనని చెబుతున్నారు. తెలుగు సినీ ప్రముఖుల మద్దతు కూడా పొందేందుకు బిజెపి ప్రయత్నాలు సాగిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ ఇందులో భాగమేనని చెబుతున్నారు.

ALso REad:అమిత్ షాతో జూ. ఎన్టీఆర్ భేటీ: ఆంధ్ర సెటిలర్ల ఓట్లకు గాలం

నిజానికి, ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ అయ్యే విషయం బిజెపి తెలంగాణ నాయకులకు ముందుగా తెలియదు. అమిత్ షా కార్యక్రమాలు బిజెపి రాష్ట్ర నాయకులకు కొద్ది ముందుగానే తెలుస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమాలో నటనకు మెచ్చి ఎన్టీఆర్ ను అమిత్ షా కలిశారని అంటున్నారు. అదే నిజమైతే అమిత్ షా రామ్ చరణ్ ను కూడా ఆహ్వానించి ఉండేవారనే మాట వినిపిస్తోంది. రాజకీయ ప్రయోజనం పొందడానికి మాత్రమే జూనియర్ ఎన్టీఆర్ తో ఆయన సమావేశమయ్యారని చెప్పవచ్చు. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో దాదాపుగా తుడిచిపెట్టుకుపోయిన నేపథ్యంలో ఆ భేటీ జరిగి ఉండవచ్చు. అంతేకాకుండా టీడిపికి జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నారు. 2009లో టీడిపి కోసం ఆయన ప్రచారం చేశారు. ఆ తర్వాత మొత్తం రాజకీయాలకే దూరమయ్యారు. 

అయితే, అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ ఎందుకయ్యారనేది ప్రశ్న. వీలైతే ఆయనను పార్టీలోకి తీసుకుని రావాలనే అమిత్ షా ఉద్దేశ్యమై ఉండవచ్చు. లేదా తమ పార్టీకి మద్దతు ఇచ్చే విధంగా ఎన్టీఆర్ ప్రభావితం చేయడం కూడా అయి ఉండవచ్చు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ కు గట్టి పోటీ ఇచ్చి వీలైతే అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్న బిజెపికి తెలంగాణలో అంధ్ర ఓటర్ల మద్దతు అవసరం. ముఖ్యంగా హైదరాబాదులోనూ దాని పరిసర ప్రాంతాల్లోనూ బిజెపికి మంచి పట్టు ఉంది. దానికి ఆంధ్ర ఓటర్ల మద్దతు తోడైతే బిజెపి అధిక శాతం ఓట్లు సాధించే అవకాశం ఉంటుందనేది ఓ అంచనా. జూనియర్ ఎన్టీఆర్ మద్దతు అందుకు ఉపయోగపడుతుందని బిజెపి నాయకులు భావిస్తున్నారు. అందులో భాగంగానే అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ అయ్యారని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అది బిజెపికి ఉపయోగపడుతుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios