హైదరాబాద్ నగరం గల్లీలా కనపడుతుందా అంటూ టీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా. శుక్రవారం జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆయన తాజ్ బంజారాలో నిర్వహించిన సదస్సులో నడ్డా మీడియాతో మాట్లాడుతూ... అవినీతి అంతం చేయడానికి, సుపరిపాలన అందించేందుకు ఎక్కడికైనా వస్తామని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కుమారుడు, కూతురు, అల్లుడు, మిత్రపక్షాల గురించి మాత్రమే కేసీఆర్ ఆలోచిస్తారా అని నడ్డా నిలదీశారు. వాస్తుకు భయపడే వ్యక్తి ప్రజలకు ఏం మంచి చేస్తారని ఆయన ప్రశ్నించారు.

నాయకుడు అంటే ప్రజల ఆస్తులకు రక్షకుడిగా ఉండాలే కానీ ఆస్తులను స్వాహా చేసేలా ఉండకూడదని జేపీ నడ్డా సూచించారు. తెలంగాణకు ఎయిమ్స్, మెట్రోకు నిధులు అందజేసింది కేంద్ర ప్రభుత్వమేనని, తెలంగాణ ప్రజలకు పలు సంక్షేమ పథకాలను అందజేసింది కేంద్ర ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేశారు.

కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి తెలంగాణా ప్రజలకు అందనివ్వడం లేదని.. ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాలంటే రాష్ట్రంలో అధికార మార్పిడి జరగాలని నడ్డా వ్యాఖ్యానించారు.