కాళేళ్వరంలో కేసీఆర్ సర్కార్ అవినీతి బట్టబయలు:బీజేపీ ఎంపీ లక్ష్మణ్
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ పై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ కుంగుబాటుపై అధికార పార్టీపై విమర్శల దాడిని పెంచాయి.
న్యూఢిల్లీ:కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్ సర్కార్ అవినీతి, నిర్లక్ష్యం బట్టబయలైందని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ విమర్శించారు. శుక్రవారంనాడు న్యూఢిల్లీలో బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. మేడిగడ్డ పిల్లర్ కుంగుబాటుపై డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికను ఇచ్చిన విషయాన్ని డాక్టర్ లక్ష్మణ్ గుర్తు చేశారు.
ప్లానింగ్, డిజైన్, నాణ్యత నియంత్రణ, నిర్వహణ లోపాలవల్లే కుంగుబాటుకు గురైందని ఆయన చెప్పారు.పునాది కింద ఉన్న ఇసుక కొట్టుకుపోయి పిల్లర్లు బలహీనపడ్డాయని డాక్టర్ లక్ష్మణ్ చెప్పారు.పౌండేషన్ మెటిరీయల్ పటిష్టత తక్కువగా ఉండడం కూడ మరో కారణమని ఆయన వివరించారు. బ్యారేజీ ప్లానింగ్ , డిజైన్ సరిగా లేకపోవడం వైఫల్యమేనని నివేదిక చెప్పిందని లక్ష్మణ్ తెలిపారు.
డ్యామ్ నిర్వహకుల నిర్లక్ష్యం వల్ల బ్యారేజీ బలహీనపడుతుందని డాక్టర్ లక్ష్మణ్ విమర్శించారు.ఈ బ్యారేజీ వైఫల్యం వల్ల తెలంగాణ ప్రజల జీవితాలకు, తెలంగాణ ఆర్దిక వ్యవస్థకు తీవ్ర నష్టాన్నికలిగించే అవకాశ ఉందని నివేదిక అభిప్రాయపడిందని లక్ష్మణ్ తెలిపారు.ఈ సమస్య పరిష్కారమయ్యే వరకు బ్యారేజీని ఉపయోగించే అవకాశం లేదని నివేదిక తెలిపిందన్నారు.
తాము కోరిన మొత్తం సమాచారం కూడ తెలంగాణ ప్రభుత్వం ఇవ్వలేదని కమిటీ పేర్కొందని డాక్టర్ లక్ష్మణ్ తెలిపారు. 20 అంశాలకు పైగా సమాచారాన్ని కమిటీ కోరితే కేవలం 12 అంశాల గురించే తెలంగాణ సర్కార్ సమాచారం ఇచ్చిందని లక్ష్మణ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన సమాచారం కూడ అసంపూర్తిగా ఉందని కమిటీ అభిప్రాయపడిందన్నారు.
మేడిగడ్డ బ్యారేజీ ఒక బ్లాకులో ఉత్పన్నమైన సమస్య మొత్తం బ్యారేజీకే ముప్పు తెచ్చిందని డాక్టర్ లక్ష్మణ్ విమర్శించారు.మొత్తం బ్లాకును పునాదుల నుండి తొలగించి తిరిగి నిర్మించాలని కమిటీ సూచించిందని డాక్టర్ లక్ష్మణ్ చెప్పారు.
రూ. 35 వేల కోట్లతో ప్రారంభమైన కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని రూ. లక్ష కోట్లకు పెంచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రీ డిజైన్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టును తెరమీదికి తెచ్చి మూడేళ్లలో హడావుడిగా ప్రాజెక్టును నిర్మించారని ఆయన విమర్శించారు.గతంలో వరదలో కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్లు మునిగిపోతే రాష్ట్ర ప్రభుత్వం సమర్ధించుకున్న విషయాన్ని డాక్టర్ లక్ష్మణ్ ప్రస్తావించారు.