మహిళా రిజర్వేషన్ బిల్లుకు అన్ని పార్టీలు మద్ధతు ఇవ్వాలని కోరారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. బీఆర్ఎస్‌లో ఎంతమంది మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేలు వున్నారని ఆయన నిలదీశారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుకు అన్ని పార్టీలు మద్ధతు ఇవ్వాలని కోరారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. మంగళవారం ఆయన పార్లమెంట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలకు మోడీ విజ్ఞప్తి చేస్తే ఖర్గే ఏం మాట్లాడారో చూశామన్నారు. కాంగ్రెస్ వైఖరిని ప్రజలు గమనించాలని లక్ష్మణ్ కోరారు. గతంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ఇలానే చేశారని ఆయన దుయ్యబట్టారు. రాజ్యసభలో ఆమోదించి.. లోక్‌సభలో గండికొట్టారని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్‌వి ఓటు బ్యాంక్ రాజకీయాలని.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీఆర్ఎస్‌కు చిత్తశుద్ధి లేదన్నారు. బీఆర్ఎస్ ఎంతమంది మహిళలకు సీట్లు ఇచ్చిందని లక్ష్మణ్ ప్రశ్నించారు. బీఆర్ఎస్‌లో ఎంతమంది మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేలు వున్నారని ఆయన నిలదీశారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కావాలని కవిత కోరడం లేదన్నారు. బీఆర్ఎస్‌లో మహిళలకు ఎందుకు ప్రాధాన్యం ఇవ్వడం లేదో చెప్పాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు.
అంతకుముందు మంగళవారం లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్. ఈ బిల్లుకు ‘‘నారీశక్తి వందన్ ’’ అనే పేరు పెట్టారు. రేపు ఈ బిల్లుపై లోక్‌సభలో చర్చించనున్నారు. ఎల్లుండి రాజ్యసభలో బిల్లుపై చర్చించనున్నారు. కేంద్రం తీసుకొస్తున్న ఈ బిల్లు వల్ల ఇకపై మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తారు. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో ఈ రిజర్వేషన్లు అమలవుతాయి. అయితే ఈ బిల్లు ఆమోదం పొందినప్పటికీ.. ప్రస్తుత లోక్‌సభ , అసెంబ్లీలపై ఎలాంటి ప్రభావం చూపదని నిపుణులు చెబుతున్నారు. డీలిమిటేషన్ తర్వాతనే బిల్లును అమల్లోకి తీసుకొస్తారు.
