బిజెపిని కీలక నేతలు వీడతారంటూ ప్రచారం... ఎవ్వరు వీడినా నష్టంలేదన్న ఎంపీ లక్ష్మణ్
తెలంగాణ బిజెపిని కీలక నేతలు కొందరు వీడతారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు కె లక్ష్మణ్ రియాక్ట్ అయ్యారు.

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ భారతీయ జనతా పార్టీని కీలక నాయకులు వీడతారంటూ జరుగుతున్న ప్రచారం ఆ పార్టీ క్యాడర్ ను కలవరపెడుతోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, రాష్ట్ర అధ్యక్ష పదవినుండి బండి సంజయ్ తొలగింపు తర్వాత బిజెపి బాగా ఢీలా పడిపోయింది. ఇది చాలదన్నట్లు బిజెపి నుండి ఇతర పార్టీల్లోకి వలసలు పెరిగిపోయాయి. ఇదే క్రమంలో కాంగ్రెస్ లో కీలక నాయకుల చేరికతో జోష్ పెరిగింది. ఈ క్రమంలోనే ఈటల రాజేందర్, విజయశాంతి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వంటి కీలక నాయకులు బిజెపిని వీడతారంటూ ప్రచారం జోరందుకుంది. ఈ ప్రచారంపై తాజాగా బిజెపి రాజ్యసభ సభ్యులు కె లక్ష్మణ్ స్పందించారు.
బిజెపిని వీడేందుకు కీలక నాయకులు సిద్దంగా వున్నారంటూ తప్పుడు ప్రచారం జరుగుతోందని... ఎవ్వరూ పార్టీని వీడతారని తాను అనుకోవడం లేదన్నారు. ఒకవేళ కొందరు ఇతర పార్టీల్లో చేరినా బిజెపికి ఎలాంటి నష్టం వుండదన్నారు. బిజెపికి కార్యకర్తలే బలమని... వారే పార్టీని గెలిపించుకుంటారని లక్ష్మణ్ అన్నారు.
తెలంగాణలో బిజెపి బలపడుతుంటే కేసీఆర్ కుటుంబం ప్రస్టేషన్ కు గురవుతోందని... అందువల్లే ఒకరిని మించి ఒకరు, ఏదీ పడితే అది మాట్లాడుతున్నారని లక్ష్మణ్ అన్నారు. ముఖ్యమంత్రి ప్రధాని నరేంద్ర మోదీ మీద కేసీఆర్ కుటుంబం అక్కసు వెళ్లగక్కుతోందని అన్నారు. తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు బిజెపిపై ఎదురుదాడి చేస్తున్నారని లక్ష్మణ్ అన్నారు.
Read More బిఆర్ఎస్ కు మరో షాక్ తప్పదా..? కాంగ్రెస్ గూటికి ఆ విద్యాసంస్థల అధినేత?
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతర్వాత కనీసం ఒక్క గ్రూప్ 1 పరీక్ష నిర్వహించేందుకు ఈ కేసీఆర్ సర్కార్ కు చేతకాలేదని లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తంచేసారు. రాష్ర్టంలో కేవలం లీకులు, లిక్కర్ ప్రభుత్వం నడుస్తోందని బిజెపి ఎంపీ ఎద్దేవా చేసారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ విభజన గురించి మాట్లాడితే తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడారని దుష్ప్రచారం చేస్తున్నారని లక్ష్మణ్ అన్నారు. ప్రధాని వ్యాఖ్యలు వక్రీకరించి రాష్ర్ట ప్రజల్లో బిజెపిపై వ్యతిరేక భావన కలిగించేందుకు బిఆర్ఎస్ కుట్ర చేస్తోందన్నారు. సకాలంలో స్పందించకపోవడం వల్లే 12 వందల మంది ప్రాణాలు బలయ్యాయని... ఇందుకు కాంగ్రెస్ కారణమని ప్రధాని అన్నారన్నారు. కాంగ్రెస్ ను అంటే ఆ పార్టీ నాయకులే స్పందించడం లేదు... కానీ కేటీఆర్ పోటీపడి మరీ విమర్శలు చేస్తున్నారని అన్నారు. అయినా కాంగ్రెస్‌ను విమర్శిస్తే కేటీఆర్ కు ఎందుకు బాధ అవుతుందో అర్థంకావడం లేదని లక్ష్మణ్ అన్నారు.
బిజెపి బీసీ వ్యతిరేక పార్టీ అని సీఎం కూతురు, బిఆర్ఎస్ ఎంపీ కవిత విమర్శిస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని లక్ష్మణ్ అన్నారు. బిజెపి ఓ బిసిని ఏకంగా ప్రధానినే చేసిందని ఆమె గుర్తుంచుకోవాలని అన్నారు. బిజెపి లాగ బిఆర్ఎస్ బీసీని ముఖ్యమంత్రిని చేసే దమ్ముందా? అని సవాల్ చేసారు. కనీసం బిఆర్ఎస్ పార్టీని అధ్యక్షుడిగా అయినా బిసి నాయకున్ని చేయగలరా అని అడిగారు. రాష్ర్ట మంత్రివర్గంలో ఎంతమంది బీసీలు ఉన్నారో కవితమ్మ చెప్పాలన్నారు.
రాజకీయంగా ఎదిగేందుకు ఎన్టీఆర్ బీసీలకు 34శాతం రిజర్వేషన్లు కల్పిస్తే బిఆర్ఎస్ వాటికి గండికొట్టిందని బిజెపి ఎంపీ అన్నారు. 34శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లను 24 శాతానికి కుదించింది వాస్తవం కాదా అని నిలదీసారు. బిసిలను ఏనాడూ పట్టించుకోని ప్రభుత్వం ఎన్నికలు రాగానే వారిపై ప్రేమను కురిపిస్తోందని బిజెపి ఎంపీ లక్ష్మణ్ అన్నారు.