హైదరాబాద్ లోక్ సభలో గెలుపు ఎవరిది? ఓవైసి కోటలో మాధవీలత మాయ... ఎగ్జిట్ పోల్స్ చెప్పేదిదే..!!

2024 లోక్ సభ ఎన్నికల్లో యావత్ దేశ దృష్టిని ఆకర్షించిన లోక్ సభ హైదరాబాద్. ఇక్కడ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ పై బిజెపి ఓ మహిళను పోటీలో నిలపడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ హైదరాబాద్ పై ఆసక్తికర అంచనాలు వెలువరిస్తున్నాయి... ‌

BJP MP Candidate Madhavi Latha given strong fight to Assaduddin Owaisi in Hyderabad Lok Sabha : Exit Polls predicted AKP

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది... ఇక  మిగిలింది ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన. ఇప్పటికే వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ బిజెపి సారథ్యంలోని ఎన్డిఏ కూటమి భారీ ఓట్లు, సీట్లతో మరో అద్భుత విజయాన్ని అందుకుంటుందని స్పష్టం చేసాయి. ప్రధాని నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధాని పీఠాన్ని అధిరోహించడం ఖాయమని సర్వేలన్నీ చెబుతున్నాయి. చివరకు ఇటీవలే తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు, పదేళ్లు అధికారంలో వున్న బిఆర్ఎస్ కు కూడా బిజెపి షాక్ తప్పదని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. కొన్ని సర్వే సంస్థలయితే మజ్లిస్ పార్టీ కంచుకోట హైదరాబాద్ లోక్ సభ లోనూ అనూహ్య ఫలితం వెలువడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నాయి. దశాబ్దాలుగా హైదరాబాద్ ఎంపీ సీటు ఓవైసి కుటుంబానిదే... కానీ ఈసారి ఏమైనా జరగొచ్చని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. 
 
హైదరాబాద్ లోక్ సభ ఫలితంపై ఏ ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతోంది..:  

ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ : 

దేశవ్యాప్తంగా బిజెపి, నరేంద్ర మోదీ హవా వీస్తోందని ... దీంతో మరోసారి ఎన్డిఏ కూటమి అత్యధిక లోక్ సభ స్థానాలను కైవసం చేసుకుంటుందని ఇండియా టుడే - మై యాక్సిస్ ఎగ్జిట్ పోల్ తేల్చింది. ఈసారి ఉత్తరాదినే  కాదు దక్షిణాది రాష్ట్రాల్లోనూ బిజెపి సత్తా చాటనుందని ...  తెలుగు రాష్ట్రాల్లోనూ బిజెపికి మంచి సీట్లు వస్తాయని తెలిపింది. మరీముఖ్యంగా తెలంగాణలో 17 సీట్లకు గాను 11 నుండి 12 బిజెపి ఖాతాలో చేరతాయని... హైదరాబాద్ ఎంపీ సీటు కూడా ఈ జాబితాలో వుండే అవకాశం వుందంటూ ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ అంచనా వేస్తోంది. 

లోక్ సభ ఎలక్షన్స్ 2024 లో కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా చర్చలో నిలిచిన స్థానం హైదరాబాద్. ముస్లిం మైనారిటీల ఓట్లు అధికంగా వుండే పాతబస్తీ ప్రాంతంలో ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమిన్ (ఎఐఎంఐఎం) చాలా బలమైన పార్టీ. ఇక్కడ ఎమ్మెల్యే అయినా... ఎంపీ అయినా మజ్లిస్ వాళ్లే. ఇలా హైదరాబాద్ ఓల్ట్ సిటీ ఓవైసీల అడ్డా... దశాబ్దాలుగా అసదుద్దీన్ ఓవైసి హైదరాబాద్ ఎంపీగా కొనసాగుతూ వస్తున్నారు. అయితే ఈసారి ఆయన గెలుపు అంత ఈజీ కాదన్నది ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ అంచనా... ఓటమి అంచునా నిలిచినట్లు తమ సర్వేలో తేలినట్లు చెబుతోంది.

బిజెపి అభ్యర్థి మాధవీలత నుండి మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసి గట్టి పోటీని ఎదుర్కొన్నాడని ఇండియా టుడే తెలిపింది. పాతబస్తీ ప్రాంతంలోని హిందూ ఓటర్లంతా ఒక్కటయినట్లు... వారంతా గంపగుత్తగా బిజెపికి ఓటేసినట్లు చెబుతున్నారు. ఇందుకు మాధవీ లత సీరియస్ ప్రచారం, బిజెపి అదిష్టానం ఆమెకు ఇచ్చిన ప్రాధాన్యత చాలా పనిచేసిందట. హైదరాబాద్ లోక్ సభను కూడా బిజెపి గెలుచుకునే అవకాశాలు లేకపోలేవని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ తెలిపింది.

ఆరా సర్వే :

హైదరాబాద్ లోక్ సభలో మజ్లిస్ కు బిజెపి గట్టి పోటీ ఇచ్చిందని ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా చెబుతున్నాయి. ఈసారి తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాల్లో బిజెపి అత్యధిక సీట్లు దక్కించుకుంటుందని  ఈ సర్వే తెలిసింది. బిజెపికి 8 నుండి 9, కాంగ్రెస్ కు 7 నుండి 8 సీట్లు వస్తాయని ఆరా మస్తాన్ ప్రకటించారు. బిఆర్ఎస్ కనీసం ఒక్క సీటు కూడా గెలుచుకోలేదని తెలిపారు. ఇక హైదరాబాద్ లోక్ సభలో బిజెపి, ఎంఐఎం మధ్య హోరాహోరీ వుండనుందని... అయితే గెలుపు అవకాశాలు ఎంఐఎం కే ఎక్కువగా వున్నాయన్నారు. అయితే బిజెపి గెలుపు అవకాశాలను కూడా కొట్టిపారేయలేం అనేలా ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్ సర్వే వుంది. 

పాలిట్రిక్స్ పర్ఫెక్ట్ ఎగ్జిట్ పోల్ : 

తెలంగాణలో బిజెపి, కాంగ్రెస్ మధ్యనే పోటీ వుందని స్థానికంగా సర్వే చేపట్టిన పాలిట్రిక్ పర్పెట్ ఎగ్జిట్ పోల్ చెబుతోంది. బిజెపికి 7‌‌-9, కాంగ్రెస్ కు 7-9 సీట్లు వచ్చే అవకాశం వుందని ఈ సర్వే వెల్లడించింది. బిఆర్ఎస్ అసలు పోటీలోనే లేదని...ఒక్క సీటు దక్కదని చెబుతున్నారు. హైదరాబాద్ లోక్ సభలో బిజెపి భారీ ఓట్లు సాధిస్తుంది... కానీ విజయం సాధించే అవకాశాలు లేవని తెలిపారు. హైదరాబాద్ లోక్ సభలో బిజెపికి 31 శాతం, ఎంఐఎంకు 49 శాతం ఓట్లు వస్తాయని ఈ సర్వే అంచనా. మొత్తంగా అసదుద్దీన్ ఓవైసికి మాధవీ లత గట్టిపోటీ ఇచ్చిందని పాలిట్రిక్ పర్పెట్ ఎగ్జిట్ పోల్ చెబుతోంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios