కాంగ్రెస్ లో బిఆర్ఎస్ కోవర్టులు..: బిజెపి ఎంపీ బండి సంజయ్ సంచలనం (వీడియో)
తెలంగాణ కాంగ్రెస్ లో అధికార భారత రాష్ట్ర సమితికి చెందిన కోవర్టులు వున్నారంటూ బిజెపి నేత బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేసారు.
కరీంనగర్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నకొద్దీ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని ప్రారంభించాయి...దీంతో నాయకుల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ఈ క్రమంలో తెలంగాణ బిజెపి మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్ పార్టీలో బిఆర్ఎస్ కోవర్టులు వున్నారంటూ సంజయ్ బాంబ్ పేల్చారు.
కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ కోసం పనిచేసేవారు వున్నారంటూ ఎప్పటినుండో ప్రచారం జరుగుతోంది. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన కొత్తలో రేవంత్ రెడ్డి బహిరంగంగానే కోవర్టులు పార్టీని వీడాలని హెచ్చరించారు. అలాగే సీనియర్ నాయకులు జానారెడ్డి, హన్మంతరావు, దామెదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్ వంటివారు సైతం కాంగ్రెస్ లో కోవర్టులు వున్నారంటూ వివిధ సందర్భాల్లో వ్యాఖ్యలు చేసారు. తాజాగా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లో బిఆర్ఎస్ కోవర్టులంటూ సంజయ్ కామెంట్స్ రాజకీయ దుమారం రేపుతున్నాయి.
వీడియో
ఇక కేసీఆర్ తన రాజకీయాల కోసం ప్రజలనే కాదు దేవుళ్ళను మోసం చేస్తున్నాడని సంజయ్ ఆరోపించారు. వినాయక చవితి పండగను కూడా ఇలాగే రాజకీయాల కోసం వాడుకున్నారని అన్నారు. ప్రతి నియోజకవర్గానికి కోట్ల రూపాయలు పంపించి వినాయక మండపాలతో రాజకీయాలు చేయిస్తున్నాడని ఆరోపించారు. ఇలా వచ్చిన డబ్బులతో కరీంనగర్ లో చిల్లర రాజకీయాలు నడుస్తున్నాయంటూ మంత్రి గంగులకు చురకలు అంటించారు. సీఎం కేసీఆర్ దేవుళ్లకు పూజలు చేసే రకం కాదని... కేవలం తాంత్రిక పూజలు మాత్రమే చేస్తుంటారని సంజయ్ ఎద్దేవా చేసారు.
Read More గణేష్ వేడుకలను బీఆర్ఎస్ రాజకీయాలకు వాడుకుంటోంది - బండి సంజయ్ కుమార్
తెలంగాణలో ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న కేసీఆర్ తన పాలనలో కనీసం ఒక్క గ్రూప్ 1 పరీక్ష నిర్వహించలేకపోతున్నాడని సంజయ్ అన్నారు. ఎప్పటినుండో ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగుల జీవితాలతో కేసీఆర్ సర్కార్ ఆటలు ఆడుకుంటోందని అన్నారు. గ్రూప్ 1 రద్దుకు సీఎం కేసీఆరే బాధ్యుడని అన్నారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోకుండా వారికి హామీకి ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. ముఖ్యంగా నిరుద్యోగ భృతి ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేసారు.
ఇప్పటికే బిఆర్ఎస్ అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు... కానీ వారిలో సగంమందికి కూడా బిఫారాలు ఇవ్వడని సంజయ్ అన్నారు. ఎన్నికల నాటికి బిఆర్ఎస్ అభ్యర్థుల్లో భారీగా మార్పులు వుంటాయన్నారు. బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కలిసి ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు మోదీ వైపే వున్నారని... తిరిగి కేంద్రంలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని ఎంపీ బండి సంజయ్ ధీమా వ్యక్తం చేసారు.