కొద్దిరోజుల క్రితం గుండెపోటుతో మరణించిన ఆర్టీసీ డ్రైవర్ నగునూరి బాబు అంతిమయాత్ర సందర్భంగా బీజేపీ నేత, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్‌పై ఏసీపీ అనుచితంగా ప్రవర్తించని ఘటన దుమారం రేపిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో తనపై పోలీసుల దౌర్జన్యం పట్ల సంజయ్ కుమార్ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. దాడికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను స్పీకర్‌కు అందజేశారు. దీనిపై స్పందించిన ఓం బిర్లా.. ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ సుశీల్ కుమార్ సింగ్‌ను ఆదేశించారు.

అలాగే లోక్‌సభ సభ్యుని పట్ల అనుచితంగా ప్రవర్తించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పీకర్ హామీ ఇచ్చారు. మరోవైపు ఈ దాడిపై జాతీయ మానవ హక్కుల సంఘం కూడా కేసు నమోదు చేసింది.

Also read:డ్రైవర్ బాబు అంతిమయాత్ర: బీజేపీ ఎంపీ సంజయ్‌పై చేయిచేసుకున్న ఏసీపీ, ఉద్రిక్తత

కాగా ఈ నెల 1వ తేదీ ఆర్టీసీ డ్రైవర్ గుండెపోటుతో మరణించారు. అయితే ఆయన అంతిమయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. బాబు మృతదేహాన్ని దారి మళ్లించి వేరే చోటుకి తరలించారు. పెద్దఎత్తున ఆర్టీసీ కార్మికులు, వారి కుటుంబసభ్యులు తరలిరావడంతో ఆరేపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.

ఆ సందర్భంగా జరిగిన తోపులాటలో బండి సంజయ్ పట్ల కరీంనగర్ ఏసీపీ అనుచితంగా ప్రవర్తించారు. ఆర్టీసీ కార్మికుడు బాబు అంతిమయాత్రపై కూడా పోలీసుల నిర్బంధం ఏంటని విపక్షనేతలు మండిపడ్డారు. ప్రభుత్వం అడుగడుగునా కార్మికులను అణచివేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. 

ఓ పోలీస్ అధికారి  కరీంనగర్  ఎంపీ బండి సంజయ్ పై  చేయి చేసుకోవడాన్ని  నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి  తీవ్రంగా ఖండించారు. ఇది తెలంగాణ ప్రభుత్వ దమన నీతికి, దుర్మార్గానికి పరాకాష్ఠ అన్నారు. వెంటనే  డీజీపీ మహేందర్ రెడ్డి స్పందించి కరీంనగర్ పోలీస్ కమిషనర్, ఏసీపీ లను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు .

Also read:శవాలను ఎత్తుకుపోయే పోలీసులున్నారు: కేసీఆర్ పై బండి సంజయ్ ఫైర్

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి  ఆ అధికారులను వెంటనే భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. నిన్నటి వరకు బీజేపీ కార్యకర్తలు , నాయకుల మీద కక్ష సాధింపు చర్యలుగా తప్పుడు కేసులు బనాయించి  వేధించిన పోలీసులు ఏకంగా కేసీఆర్ మెప్పు కోసం, కేసీఆర్ ఆదేశాల మేరకు బీజేపీ నాయకుల మీద తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారని అర్వింద్ ఆరోపించారు.

నిజామాబాద్  లో  కవిత, కరీంనగర్ లో వినోద్ రావులు ఓడిన నాటి నుంచి  కేసీఆర్ ప్రభుత్వ వ్యవహారశైలి ఇలాగే ఉందన్నారు. రాష్ట్రంలో కేసీర్ పాలన శాశ్వతం కాదన్న విషయాన్ని పోలీసులు గుర్తించాలని  ఆయన హితవు పలికారు.