రాజన్న సిరిసిల్ల : మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్. టీఆర్ఎస్ పార్టీలో ఓనర్ల చిచ్చు మెుదలైందని విమర్శించారు. మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యలే అందుకు నిదర్శనమంటూ చెప్పుకొచ్చారు. 

ఈటల రాజేందర్ కు దమ్ముంటే మంత్రి పదవికి, పార్టీకి రాజీనామా చేసి బయటకు రావాలని సవాల్ విసిరారు. పార్టీలో ఎప్పటి నుంచో అసంతృప్తి మెుదలైందని అది రాబోయే రోజుల్లో మరింత బయటపడుతుందని తెలిపారు. 

మిడ్ మానేరు నిర్వాసితుల బహిరంగ సభలో పాల్గొన్న ఎంపీ బండి సంజయ్ కుమార్  కేసీఆర్ కు చింతమడకపై ఉన్న ప్రేమ ముంపు గ్రామాలపై లేదని చెప్పుకొచ్చారు. ముంపు గ్రామాల ప్రజలు ఏం పాపం చేశారని ప్రశ్నించారు. 

ముంపు ప్రాంతాల ప్రజలకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. మిడ్‌మానేరు నిర్వాసితులకు బీజేపీ అన్ని విధాల అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పరిహారం వచ్చే వరకు జెండాలు పక్కకు పెట్టి పోరాటం చేస్తామని చెప్పుకొచ్చారు.  

సీఎం కేసీఆర్‌ తన సొంత గ్రామంలో ప్రతి కుటుంబానికి రూ.10లక్షల ఇస్తామని పదేపదే చెప్తున్నారని కానీ ముంపునకు గురైన కుటుంబాలకు మాత్రం నయాపైసా ఇవ్వడం లేదని విమర్శించారు.  

చావుకైనా తెగబడి మరోసారి మలిదశ ఉద్యమాన్ని ఇక్కడి నుంచే మొదలు పెడదామని ప్రజలకు పిలుపునిచ్చారు. ధర్నాలతో కాకుండా ప్రగతి భవన్‌ను ముట్టడించి కేసీఆర్‌ సంగతేంటో చూద్దామని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్‌ మిడ్‌మానేరు ప్రాంతానికి వస్తే ప్యాకేజీతోనే రావాలని లేదంటే తమ తడాఖా ఎంటో చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు ఎంపీ సంజయ్ కుమార్ .