హైదరాబాద్:ఒక  కుటుంబానికి రూ 2 వేలు పెన్షన్ ఇస్తూ  కేసీఆర్ కుటుంబం రూ. 15 లక్షలు  తీసుకొంటుందని నిజామాబాద్ ఎంపీ అరవింద్ కుమార్ విమర్శించారు.

మంగళవారంనాడు  హైద్రాబాద్ బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 24 గంటల పాటు విద్యుత్ ను సరఫరా చేస్తామని చెబుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలు చెబుతోందన్నారు. దేశంలో ఏ రాష్ట్రం నిరంతర విద్యుత్ ఇవ్వడం లేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు

 గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏ మేరకు నెరవేర్చారో చెప్పాలన్నారు.

గత ఎన్నికల్లోనే నాయిబ్రహ్మణులకు, రజకులకు ఉచిత విద్యుత్ ఇస్తామని టీఆర్ఎస్ హామీ ఇచ్చిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.  కేసీఆర్ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. 

ఐదేళ్లలో ఎప్పుడూ లేనిది జీహెచ్ఎంసీ కార్మికులు ఎన్నికల సమయంలో గుర్తుకు వచ్చారని ఆయన విమర్శించారు. మాయామాటలు చెప్పి ఓట్లు  దండుకొనేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపెట్టేలా కేసీఆర్ ప్రయత్నిస్తారని ఆయన విమర్శలు గుప్పించారు.