తాను పార్టీ మారుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారంపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు క్లారిటీ ఇచ్చారు . వచ్చే ఎన్నికల్లో బీజేపీ బీ ఫామ్ మీద దుబ్బాకలోనే పోటీచేసి గెలుస్తానని రఘునందన్ ధీమా వ్యక్తం చేశారు.
తాను పార్టీ మారుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారంపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు క్లారిటీ ఇచ్చారు. శనివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గజ్వేల్‌లో కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసేందుకు వెళ్తున్న కామారెడ్డి నేతలను ఏడుగంటల పాటు వ్యానుల్లో తిప్పి పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారని ఫైర్ అయ్యారు. వీరిని పరామర్శించేందుకు వెళ్తున్న తనను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో హక్కులు వున్నాయా .. లేదా అన్న దానిపై డీజేపీ సమాధానం చెప్పాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఆయనకు తెలుగు అర్ధం కాకపోతే బీహార్ భాషలోనే చెబుతామని రఘునందన్ చురకలంటించారు.
రాష్ట్రంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని.. అభివృద్ధి జరిగితే.. దానిని చూసేందుకు వెళ్తే అరెస్ట్‌లు ఎందుకని ఆయన ప్రశ్నించారు. గజ్వేల్‌కు కచ్చితంగా వస్తామని.. ఎంత అభివృద్ది జరిగిందో చూస్తామని రఘునందన్ తేల్చిచెప్పారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. తనకు పార్టీ మారాల్సిన అవసరం లేదని ఆయన కుండబద్ధలు కొట్టారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ బీ ఫామ్ మీద దుబ్బాకలోనే పోటీచేసి గెలుస్తానని రఘునందన్ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒకే కోవకు చెందినవంటూ ఆయన ఆరోపించారు.
Also Read: జమిలి ఎన్నికలు: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా?
ఇదిలావుండగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జీ కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ముందు ముందు బీజేపీలోకి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని వివరించారు. అన్ని వర్గాల నుంచి బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కు సంఘాల పెద్దలు, వెనుకబడిన తరగతుల వారు తమ పార్టీలో చేరడానికి రెడీగా ఉన్నారని చెప్పారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
కామారెడ్డి నుంచి గజ్వేల్‌కు వెళ్లుతున్న బీజేపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయం పై బీజేపీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి మండిపడ్డారు. గజ్వేల్ నియోజకవర్గం కేసీఆర్ ప్రైవేట్ ఆస్తి కాదని ఫైర్ అయ్యారు. కామారెడ్డి నుంచి గజ్వేల్‌కు వెళ్లుతున్న బీజేపీ నేత రమణా రెడ్డి, కార్యకర్తలను అరెస్టు చేయడం అప్రజాస్వామికం అని అన్నారు.
బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరగలేదని, వారి బాధ్యతను బీజేపీ తీసుకుంటుందని చెప్పారు. ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా విడుదల కాకముందే బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ నేతలను వేధించడం మొదలు పెట్టిందని ఆరోపించారు. తమ పార్టీ నేతలు కామారెడ్డి నుంచి గజ్వేల్‌కు వెళ్లితే కేసీఆర్‌కు ఎందుకు భయం అని అడిగారు.
