తెలంగాణ ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి సోమేష్ కుమార్ పై నమోదయిన రిట్ పిటిషన్ ఐదేళ్లుగా న్యాయస్థానం విచారణకు రాకపోవడంపై అనుమానాలున్నాయంటూ దేశ అత్యున్నత న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కు బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ లేఖ రాసారు. 

హైదరాబాద్: తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ (cs somesh kumar) పై దాఖలయిన రిట్ పిటిషన్ పై విచారణ జరిగేలా చూడాలని కోరుతూ బిజెపి ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు (raghunandan rao) సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ (justice nv ramana)ను కోరారు. అంతేకాదు సోమేష్ కుమార్ వున్న కోర్టు దిక్కరణ కేసులు, ప్రజాప్రతినిధుల పట్ల ఆయన వ్యవహరించే తీరును వివరిస్తూ సీజెఐకి బిజెపి ఎమ్మెల్యే లేఖ రాసారు. 

ప్రస్తుతం ప్రభుత్వ ప్రదాన కార్యదర్శిగా వున్న సోమేష్ కుమార్ పై 2017లో భారత ప్రభుత్వం రిట్ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ ఐదేళ్లుగా విచారణకు రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ పేర్కొన్నారు. పిటిషన్ ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ కు రాకుండా అడ్డుపడుతూ ఎవరో సోమేష్ కుమార్ ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని... అది ఎవరో తేల్చాలని సిజెఐని కోరారు ఎమ్మెల్యే రఘునందన్.

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విభజన సమయంలో సోమేష్ కుమార్ ను తెలంగాణకు కాకుండా ఏపీకి కేటాయించారని బిజెపి ఎమ్మెల్యే గుర్తుచేసారు. ఇలా నిబంధనల ప్రకారం ఏపీ కేటాయించిన ఐపిఎస్ తెలంగాణలో ఎలా పనిచేస్తున్నారని రఘునందన్ ప్రశ్నించారు. నిబంధనలు పాటించకుండా తప్పుడు పనులు చేస్తున్న తెలంగాణ సీఎస్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని సీజెఐ ను కోరారు రఘునందన్. 

సీఎస్ సోమేష్ కుమార్ పై ఇప్పటివరకు 365 కోర్టు దిక్కరణ కేసులున్నాయని... వాటిని కూడా విచారించాలని రఘునందన్ కోరారు. సీఎస్ ఎమ్మెల్యేలనే కాదు చివరకు తమను సైతం పట్టించుకోరని స్వయంగా ప్రభుత్వంలోని మంత్రులే చెబుతున్నారని అన్నారు. ఇక ధరణి సమస్యలను కూడా పరిష్కరించకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని సీజెఐకి రాసిన లేఖలో రఘునందన్ పేర్కొన్నారు. 

తెలంగాణ సీఎస్ పై ఓవైపు న్యాయస్ధానాల్లో పోరాడుతూనే మరోవైపు ప్రజాక్షేత్రంలోనూ దోషిగా నిలబెడతామని రఘునందర్ అన్నారు. ఇక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నుండి తమ సస్పెషన్ పై కూడా పోరాటం కొనసాగుతుందని... కోర్టుల ద్వారా న్యాయం దక్కుతుందని పూర్తి విశ్వాసం వుందని రఘునందన్ పేర్కొన్నారు. 

ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy) కూడా సోమేష్ కుమార్ పై సీరియస్ అయ్యారు. రాష్ట్ర విభజన సమయంలో డీఓపీటీ సోమేష్ కుమార్ ను ఏపీ కేడర్ కు కేటాయించిందని...ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ ఆయన కోర్టును ఆశ్రయించారన్నారు. అయితే కోర్ట్ ఆదేశాలను DOPTఛాలెంజ్ చేసిందని... ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించిన ఫైల్ బెంచీ మీదకు రావడం లేదని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ ఫైలు ఎందుకు బెంచీ మీదకు రావడం లేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ గానీ, కేంద్ర ప్రభుత్వానికి చెందిన అడిషనల్ సొలిసిటర్ జనరల్ కానీ ఈ కేసు గురించి ఎందుకు మాట్లాడడం లేదని రేవంత్ రెడ్డి అడిగారు.

సోమేష్ కుమార్, అంజనీ కుమార్ లాంటి బీహార్ రాష్ట్రానికి చెందిన వాళ్లకు తెలంగాణలో కీలక పదవులు కేటాయిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో కీలక శాఖల్లో బీహార్ రాష్ట్రానికి చెందినవారికే కట్టబెట్టారని రేవంత్ రెడ్డి విమర్శించారు. 157 మంది IAS అధికారులలో ప్రతిభ ఉన్న అధికారులు లేరా అని ఆయన ప్రశ్నించారు. సోమేష్ కుమార్, అరవింద్ కుమార్, రజత్ కుమార్, సందీప్ కుమార్ సుల్తానియా వంటి బిహారీ అధికారుల వద్ద ఒక్కొక్కరి వద్ద నాలుగు నుండి ఐదు శాఖలున్నాయన్నారు. కానీ తెలంగాణకు చెందిన ఐఎఎస్‌లకు కనీసం శాఖలు కూడా కేటాయించడం లేదని రేవంత్ మండిపడ్డారు.