తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సంచలన ఆరోపణలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే , మాజీ మంత్రి ఈటల రాజేందర్. వేల ఎకరాలు దోపిడీ చేయడానికే కేసీఆర్ ధరణీ పోర్టల్ పెట్టారా అని ఆయన ప్రశ్నించారు.  

తెలంగాణలో రైతుబంధు రాక, పాస్‌ పుస్తకాలు లేక పలువురు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బీజేపీ ఎమ్మెల్యే , మాజీ మంత్రి ఈటల రాజేందర్. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ధరణీ పోర్టల్‌లో లోపాలను సరిచేస్తామని సీఎం చెప్పారని, కానీ రెండేళ్లు గడుస్తున్నా ఎలాంటి చర్యలూ చేపట్టలేదన్నారు. దీనిపై మంత్రివర్గ ఉపసంఘం రిపోర్ట్ ఏమైందో తెలియదని రాజేందర్ దుయ్యబట్టారు. నిన్న ఒక్కరోజే నలుగురు రైతులు ఆత్మహత్యాయత్నం చేశారని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. ధరణి సమస్యలు పరిష్కారం కాకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని ఆయన వాపోయారు. రాష్ట్రవ్యాప్తంగా 18 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో వున్నాయని రాజేందర్ చెప్పారు. 

ప్రాజెక్ట్ కమీషన్ల కంటే ధరణి కుంభకోణం పెద్దదని ఆయన ఆరోపించారు. భూములన్నీ కేసీఆర్, ఆయన కుటుంబ కబ్జాలోకి వెళ్తున్నాయని బేరం కుదిరితే లాక్ ఓపెన్ చేస్తున్నారని,లేదంటే క్లోజ్ చేస్తున్నారని రాజేందర్ దుయ్యబట్టారు. దీని డిజైనర్ కేసీఆరేనని.. ధరణి భూములపై శ్వేత పత్రం విడుదల చేయాలని ఈటల డిమాండ్ చేశారు. లేదంటే పరిపాలించే నైపుణ్యం లేదు అని రాజీనామా చెయ్యాలని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్లు ముఖ్యమంత్రి మెప్పు పొందడానికి అంతా అయిపోయిందని చెబుతున్నారని.. కేసీఆర్ కూడా మెచ్చుకొని రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌కి ఒక నెల జీతం బోనస్ కూడా ఇచ్చారని రాజేందర్ గుర్తుచేశారు.

Also Read:నాకు, నా కుటుంబ సభ్యులకు ఏమైనా జరిగితే కేసీఆర్ దే బాధ్యత: ఈటల రాజేందర్

లక్షలాది మంది రైతులు ధరణితో ఇబ్బంది పడుతున్నారని.. రకరకాల ఇబ్బందులతో 24 లక్షల దరఖాస్తులు వస్తే కేవలం 6 లక్షల దరఖాస్తులు మాత్రమే పరిష్కరించారని ఈటల దుయ్యబట్టారు. ధరణి రైతాంగం కోసం పెట్టారా ? కేసీఆర్, ఆయన కుటుంబం వేల ఎకరాల భూమి కొట్టేయడానికి పెట్టారా అని రాజేందర్ ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లా గండిపేటలో 1000 ఎకరాల భూమి ప్రగతి భవన్‌తో సంబంధం ఉన్న వ్యక్తుల ప్రమేయంతో.. నిషేధిత జాబితా నుండి మారిపోయిందని దుయ్యబట్టారు.