నాకు, నా కుటుంబ సభ్యులకు ఏమైనా జరిగితే కేసీఆర్ దే బాధ్యత: ఈటల రాజేందర్
చావుకు కూడ తాను భయపడనని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చెప్పారు. గతంలో తనపై రెక్కీ నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నమ్మిన సిద్దాంతం కోసం తాను పోరాటం చేస్తున్నట్టుగా ఈటల రాజేందర్ చెప్పారు.
హైదరాబాద్:తనకు, తన కుటుంబ సభ్యులకు ఎలాంటి ఇబ్బంది కలిగినా తెలంగాణ సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చెప్పారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బుధవారం నాడు మీడియతో మాట్లాడారు.తనపై దాడి జరిగితే అది తెలంగాణ ప్రజలపై జరిగిన దాడిగా భావించాల్సి ఉంటుందన్నారు. గతంలో కూడా తనపై దాడికి రెక్కీ నిర్వహించిన విషయాన్ని రాజేందర్ గుర్తు చేశారు.అంతేకాదు తను బెదిరించారని కూడా చెప్పారు. ఆ సమయంలోనే తాను భయపడలేదన్నారు. తాను చావుకు భయపడనని ఆయన తేల్చి చెప్పారు. నమ్మిన సిద్దాంతం కోసం తాను ఎన్నిక బెదిరింపులైనా ఎదుర్కొంటానని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.
తాను స్పీకర్ ను మరమనిషి అంటే తప్పు అని చెబుతున్న టీఆర్ఎస్ నేతలు సీఎం కేసీఆర్ మాటల గురించి ఏమంటారని ఆయన ప్రశ్నించారు. తిట్లనే తెలంగాణ భాషగా కేసీఆర్ చెప్పుకుంటారని ఈటల రాజేందర్ గుర్తు చేశారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కూడా ఒక్క ఎమ్మెల్యే కు కూడా బీఏసీ సమావేశానికి ఆహ్వానం అందేదన్నారు. ఈ విషయమై తాము ప్రశ్నించినట్టుగా చెప్పారు. ఇదే విషయాన్ని తమ ఎమ్మెల్యే రఘునందర్ రావు అడిగినా స్పీకర్ నుండి స్పష్టత రాలేదన్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఓడించేవదరకు తాను నిద్రపోనని ఈటల రాజేందర్ ప్రకటించారు. తన మాటలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. తెలంగాణ ప్రజలు కూడా కేసీఆర్ ను గద్దెదింపేందుకు సిద్దంగా ఉన్నారని ఆయన తెలిపారు.
also read:న్యాయ పోరాటం చేస్తాం: అసెంబ్లీ ,నుండి ఈటల సస్పెన్షన్ పై బండి సంజయ్
బీఏసీ సమావేశానికి ఆహ్వానం అందకపోవడంతో ఈ నెల 6వ తేదీన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మరమనిషిగా నిర్ణయాలు తీసుకోవద్దని ఈటల రాజేందర్ కోరారు.ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. నిన్న అసెంబ్లీలో ఈటల రాజేందర్ మాట్లాడే సమయంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు.ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడంతో పాటు క్షమాపణలు చెప్పాలని కోరారు.తాను స్పీకర్ ను అవమానించేలా మాట్లాడలేదని అసెంబ్లీలో ఈటల రాజేందర్ చెప్పారు. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యల విషయంలో క్ఝషాపణలు చెప్పనందుకు అసెంబ్లీ నుండి ఈటల రాజేందర్ ను నిన్న సస్పెండ్ చేశారు. అసెంబ్లీ నుండి సస్పెన్షన్ కు గురైన తర్వాత ఈటల రాజేందర్ ను పోలీసులు తమ వాహనంలో ఆయన ఇంటి వద్ద దింపారు.