సిద్దిపేట జిల్లా హుస్సాబాద్ నియోజకవర్గంలో నిర్మిస్తున్న గౌరవెల్లి ప్రాజెక్ట్ లో ఇళ్లు, భూములు కోల్పోతున్న నిర్వాాసితులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంపై బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సీరియస్ అయ్యారు.
సిద్దిపేట: ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లా, ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లాలో చేపట్టిన గౌరవెల్లి ప్రాజెక్ట్ ప్రారంభానికి సిద్దమయ్యింది. అయితే ఈ ప్రాజెక్ట్ వల్ల ఇళ్ళు,భూములు కోల్పోయిన నిర్వాసితులు మాత్రం ఇప్పటివరకు తమకు పరిహారం అందలేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న అర్ధరాత్రి హుస్నాబాద్ నియోజకవర్గం అక్కనపేట మండలం గుడాటిపల్లి గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిర్వాసిత గ్రామాన్ని ఖాళీ చేయించడానికి పోలీసులు ప్రయత్నించగా అందుకు గ్రామస్తులు ఒప్పుకోలేదు. దీంతో గ్రామస్తులు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగి చివరికి పరిస్థితి అదుపుతప్పడంతో లాఠీ చార్జ్ జరిగింది.
ఇలా గౌరవెల్లి ప్రాజెక్ట్ నిర్వాసిత ప్రజలపై జరిగిన లాఠీచార్జ్ పై బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (eatala rajender) సీరియస్ అయ్యారు. వందల మంది పోలీసులు గుడాటిపల్లిపై దాడి చేసి గ్రామస్థులను విచక్షణ రహితంగా కొట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాని ఈటల అన్నారు. ఒప్పందం ప్రకారంఅందాల్సిన బెనిఫిట్స్ అన్నీ అందించిన తరువాతే సర్వే చేపట్టాలని గ్రామస్థుల డిమాండ్ చేస్తున్నారని... వెంటనే దాన్ని నెరవేర్చాలని సూచించారు. గ్రామస్తుల రక్తాన్ని కళ్ళజూసిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఈటల రాజేందర్ హెచ్చరించారు.
ఇక గౌరవెల్లి ప్రాజెక్ట్ నిర్వాసిత గ్రామం గుడాటిపల్లిలో జరిగిన లాఠీచార్జ్ పై మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ (ponnam prabhakar) కూడా స్పందించారు. భూ నిర్వాసితులపై దాడి చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. భూనిర్వాసితులపై దాడి చేయడం ప్రభుత్వానికే సిగ్గుచేటని పొన్నం ఆగ్రహం వ్యక్తం చేసారు. అర్ధరాత్రి నిర్వాసిత గ్రామంలో అలజడి సృష్టిస్తూ పోలీసులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నిర్వాసితులపై ప్రభుత్వం సానుకులంగా స్పందించి న్యాయం చేయాల్సింది పోయి తిరుగుబాటు చేయడం సిగ్గు చేటని పొన్నం మండిపడ్డారు.
భూనిర్వాసితులపై ప్రభుత్వమే పోలీసుల చేత దాడులు చేయించడం నీచమైన చర్యగా పొన్నం పేర్కొన్నారు. గౌరవెల్లి ప్రాజెక్ట్ ట్రయల్ రన్ ప్రక్రియ ఆపాలని కోర్టు నిర్ణయించి స్టే ఇచ్చినా ప్రభుత్వం ఒంటెద్దు పోకడతో నిర్వాసితులను బలవంతంగా కాలి చేయించాలని చూస్తుందన్నారు. వెంటనే గ్రామస్తులతో చేసుకున్న ఒప్పందం మేరకు పరిహారం అందించాలని పొన్నం డిమాండ్ చేసారు.
భూనిర్వాసితులపై దాడిచేసిన పోలీస్ అధికారులను సస్పెండ్ చేయాలని పొన్నం డిమాండ్ చేసారు. అలాగే నిర్వాసితుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని మాజీ ఎంపీ పొన్నం పేర్కొన్నారు.
ఇదిలావుంటే ఇటీవల హుస్నాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే సతీశ్ కుమార్‌కు గౌరవెల్లి ప్రాజెక్ట్ నిర్వాసితుల నుండి చేదు అనుభవం ఎదురయ్యింది. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లిలో నిర్వాసితులు చేపట్టిన దీక్షా శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్యే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆయన మాటలను నిర్వాసితులు పట్టించుకోలేదు. అంతేకాదు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నిర్వాసితులు నినాదాలతో హోరెత్తించారు. తమ సమస్యలు పరిష్కరించాకే ప్రాజెక్టు పనులు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. అప్పటి వరకు ప్రాజెక్టు పనులు జరగనివ్వబోమని తేల్చి చెప్పారు. ఎమ్మెల్యేకు, టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో సతీష్ కుమార్ వెనుదిరిగారు.
