హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై సమరానికి కూడా బిజెపి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను అస్త్రంగా ప్రయోగించే అవకాశం ఉన్నట్లు అర్థమవుతోంది. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై పోరుకు ఆయనను అస్త్రంగా ప్రయోగించాలని మాత్రమే బిజెపి భావిస్తున్నట్లు భావించారు. కానీ, తాజా పరిణామాన్ని పరిశీలిస్తే తెలంగాణలో ఆయనను ముందు పెట్టే అవకాశాలున్నాయి. 

తెలంగాణలో కూడా పవన్ కల్యాణ్ కు అభిమానులు దండిగానే ఉన్నారు. దాంతో తెలంగాణలో కూడా జనసేనతో వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడానికి బిజెపి కసరత్తు చేసే అవకాశాలు లేకపోలేదు. గ్రేటర్ హైదరాబాదులోని ముఖ్య నేతలతో పవన్ కల్యాణ్ శనివారం సమావేశమయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ (జిహెచ్ఎంసీ) ఎన్నికల నాటికి ఇరు పార్టీలు ఉమ్మడిగా కార్యాచరణకు దిగే అవకాశం లేకపోలేదు,

Also Read: వైఎస్ జగన్ మొండిఘటం: పవన్ కల్యాణ్ ధీటు రాగలరా?

అన్ని కోణాల్లో ఆలోచించిన తర్వాతనే బిజెపితో పొత్తుపై నిర్ణయం తీసుకున్నామని పవన్ కల్యాణ్ హైదరాబాదు ముఖ్య నేతలతో చెప్పారు. తెలుగు రాష్ట్రాల, దేశ దీర్షకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని బిజెపితో పొత్తు పెట్టుకున్నట్లు తెలిపారు. బిజెపి అగ్ర నాయకత్వంతో పలుమార్లు గతంలో చర్చలు జరిగినట్లు కూడా తెలిపారు. పొత్తు విషయంలో ఇరు వైపుల నుంచి కూడా ఏ విధమైన షరతులు లేవని చెప్పారు .

తెలంగాణలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పార్టీని బలోపతం చేయడానికి సమయం తీసుకుంటున్నట్లు పవన్ కల్యాణ్ చెప్పారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆయన చెప్పారు. ముందుగా గ్రేటర్ హైదరాబాద్ కమిటీని నియమించాలని, ఆర్హులైన పేర్లను కార్యకర్తలే సూచించాలని ఆయన చెప్పారు. ఇక నుంచి నెలలో కొన్ని రోజుల పాటు తెలంగాణలో పార్టీ కార్యకలాపాల కోసం సమయాన్ని కేటాయిస్తానని ఆయన చెప్పారు. 

Also Read: బీజేపీతో పవన్ కళ్యాణ్ పొత్తు: జనసేనకు కేంద్ర మంత్రిపదవి...?

పవన్ కల్యాణ్ మాటలను బట్టి చూస్తే బిజెపితో పొత్తు ఏపీకి మాత్రమే పరిమితం కాదని అర్థమవుతోంది. తెలంగాణలో కూడా ఆ పొత్తు కొనసాగుతుందనేది స్పష్టమవుతోంది. కేసీఆర్ తెలంగాణలో బిజెపిని రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తున్నారు. తెలంగాణలో బిజెపి లక్ష్యం టీఆర్ఎస్ కాబట్టి పవన్ కల్యాణ్ తో జోడీ కట్టి ఎదుర్కోవాలని చూస్తున్నట్లు అర్థమవుతోంది.